Leading News Portal in Telugu

121 Million Painting: Rene Magritte Painting Sets World Record For Surreal Work Of Art


  • కళ్లు చెదిరే ధర
  • వెయ్యి కోట్లు పలికిన పెయింటింగ్‌
  • 1954కు చెందిన పెయింటింగ్‌
Rare Painting: ఇది విన్నారా?.. రూ.1021 కోట్లు పలికిన పెయింటింగ్‌!

బెల్జియం సర్రియలిస్ట్‌ ఆర్టిస్టు ‘రెన్‌ మార్గిట్‌’ వేసిన ఓ పెయింటింగ్‌ వేలంలో రికార్డు ధరను కొల్లగొట్టింది. మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన క్రిస్టీస్‌ వేలంలో ఏకంగా 121 మిలియన్ డాలర్లు పలికి సంచలనం సృష్టించింది. భారత కరెన్సీలో ఈ ధర రూ.1021 కోట్లు. అధివాస్తవికతను చిత్రించే పెయింటింగ్‌లలో అత్యధిక ధర పలికిన రికార్డును ఇది సొంతం చేసుకుంది. ఈ రికార్డు ధర తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అదే సమయంలో రెనె మాగ్రిట్‌ను ‘మాస్టర్‌ ఆఫ్‌ సర్రియలిజం’ అని ఊరికే పిలవరని అంటున్నారు.

పగలు, రాత్రి అద్భుతంగా కనిపించేలా వేసిన ఈ కళాఖండానికి ‘ఎల్ ఎంపైర్ డెస్ లూమియర్స్’ లేదా ‘ద ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌’ అని అంటారు. 1954కు చెందిన ఈ పెయింటింగ్‌.. అధివాస్తవికతకు సంబంధించి అత్యుత్తమ వ్యక్తీకరణగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సర్రియలిస్ట్‌ రెన్‌ మార్గిట్‌ వేసిన 27 ప్రఖ్యాత పెయింటింగ్‌ల కలెక్షన్‌ ‘ద ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌’లో ఈ పెయింటింగ్‌ను మణిపూసగా చెబుతారు. వీధి దీపపు వెలుగుల్లో ఇల్లు.. ఇంటికి ముందూ, వెనక చెట్లు.. ఇంటిపైన నీలాకాశం, తెల్లని మబ్బులు.. నీటిలో వాటి ప్రతిబింబం చూసేందుకు సాదాసీదాగా ఉన్నా వాస్తవికతకు అద్దం పడుతోంది.

నిజానికి ఈ పెయింటింగ్‌కు 9.5 కోట్ల డాలర్ల దాకా పలకవచ్చని నిర్వహకులు అంచనా వేశారట. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. ఏకంగా రూ.1021 కోట్లు పలికింది. రెన్‌ మార్గిట్‌ వేసిన మరో రెండు పెయింటింగులు కూడా భారీ ధరను సొంతం చేసుకున్నాయట. లా కోర్ డి అమర్, లా మెమోయిర్ పెయింటింగులు కోటి, 37 లక్షల డాలర్ల చొప్పున అమ్ముడయ్యాయట. రెన్‌ మార్గిట్‌ కెరీర్ మొత్తంలో ఎలాంటివి 17 ఉన్నాయట.