Leading News Portal in Telugu

WPL 2025 Schedule Released, Tournament to Begin on February 14 with 22 Matches Across 4 Venues


  • మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కౌంట్‌డౌన్.
  • WPL 2025 షెడ్యూల్‌ విడుదల.
  • ఫిబ్రవరి 14న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్‌ మధ్య మొదటి మ్యాచ్.
WPL 2025: మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కౌంట్‌డౌన్.. టోర్నీ షెడ్యూల్ ప్రకటన

WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కొత్త సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలయింది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న WPL మూడవ సీజన్ ఫిబ్రవరి 14, 2025నుండి ప్రారంభం కానుంది. ఈసారి 5 జట్లు ఈ లీగ్‌లో పోటీ పడనున్నాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) WPL 2025 షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 14న ప్రారంభమై, మార్చి 15న జరిగే టైటిల్ మ్యాచ్‌తో ముగియనుంది. ఈసారి WPL లీగ్ యొక్క పరిధిని విస్తరించేందుకు BCCI భారీ నిర్ణయం తీసుకుంది. గతంలో, WPL మొదటి సీజన్ ముంబైలోని రెండు వేర్వేరు మైదానాల్లో మాత్రమే జరగగా, చివరి సీజన్ బెంగళూరు, ఢిల్లీలో మాత్రమే జరిపింది. అయితే, ఈసారి 4 వేదికల్లో 22 మ్యాచ్‌లు జరిపేందుకు రంగం సిద్ధం చేసింది. లీగ్ ఈసారి లక్నో, ముంబై, వడోదర, బెంగళూరులలో నిర్వహించబడుతుంది.

WPL 2025 సీజన్ ఫిబ్రవరి 14న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్‌తో వడోదరలోని కొత్త కోటంబి స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. టోర్నీలో మొదటి 6 మ్యాచ్‌లు వడోదరలో జరుగుతాయి. ఆపై, ఫిబ్రవరి 21 నుండి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో 8 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆపై మార్చి 3 నుండి లక్నో వేదికపై 4 మ్యాచ్‌లు జరిగేలా షెడ్యూల్ ఉంది. చివరి 4 మ్యాచ్‌లు, క్వాలిఫయర్స్‌తో సహా, ముంబైలోని చారిత్రాత్మక బ్రబౌర్న్ స్టేడియంలో జరగనున్నాయి.

ఈసారి టోర్నమెంట్‌ను 30 రోజులు జరపడానికి BCCI నిర్ణయం తీసుకుంది. గతేడాది 23 రోజులుగా ఉన్న టోర్నీని ఈసారి 30 రోజులుగా ఏర్పాటు చేయడం ద్వారా ఆటగాళ్లకు మంచి విశ్రాంతి సమయం అందించనున్నారు. ప్రతి మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఒక రోజులో ఒక మ్యాచ్ మాత్రమే జరుగుతుంది. తద్వారా జట్లకు 8 రోజులు విశ్రాంతి ఉంటుంది.