Leading News Portal in Telugu

ఇలా వైసీపీకి రాజీనామా.. అలా కమలం కండువా! | karumuri ravichandra reddy resigns ycp| join| bjp| one| hour| shock


posted on Jan 18, 2025 4:00PM

ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేదు. ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అన్న బేధం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పుట్టి మునిగిపోతోంది. ఆ పార్టీ నుంచి వలసల వరద వెల్లువెత్తుతోంది. ఆ వలసల వరద ధాటికి వైసీపీ గేట్లు పగిలిపోతున్నాయి. జగన్ తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నాయి. ఒకరు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు జనసేన గూటికి  చేరిపోతున్నారు. దీంతో వైసీపీ బైసీపీగా మారిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

పెద్ద సంఖ్యలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ మారిపోతుండగా ఇప్పుడు ఇక ఆ పార్టీ కీలక నేతలు, జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.  తాజాగా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిథి కారుమూరి రవిచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. గత కొన్నేళ్లుగా వైసీపీ గొంతుకలా వ్యవహరిస్తున్న కారుమూరి ఇప్పుడు జగన్ కు జెల్ల కొట్టి పార్టీకి రాజీనామా చేసేశారు. అంతే కాదు ఇలా రాజీనామా చేసి అలా బీజేపీ కండువా కప్పేసుకున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించిన కారుమూరి… ఆ లేఖ పంపిన గంటలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. 

దీనిని బట్టి చూస్తూ కారుమూరి రవిచందరారెడ్డి చాలా కాలంగా వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారనీ, అన్నీ చూసుకుని శనివారం (జనవరి 18)న ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పంచన చేరారనీ అవగతమౌతుంది.  కారుమూరి రవిచంద్రారెడ్డి రాజీనామా ఎలా చూసినా వైసీపీకి కోలుకోలేని దెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ వైసీపీ తరఫున దూకుడుగా వ్యవహరించారు. ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ కూడా చాలా చురుకుగా ఉన్నారు. అసలే పార్టీ తరఫున గట్టిగా గళం వినిపించే నేతలు కరవై సతమతమౌతున్న వైసీపీకి కారుమూరి గుడ్ బై చెప్పడం గట్టి షాక్ అనే చెప్పవచ్చు.