Leading News Portal in Telugu

Gaza Ceasefire Begins After Hamas Shares Names Of 3 Hostages To Be Freed Today


  • ఇజ్రాయిల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ప్రారంభం..
  • బందీల్లో ముగ్గురిని విడుదల చేయనున్న హమాస్..
  • 15 నెలల యుద్ధానికి తాత్కాలిక ఉపశమనం..
Gaza Ceasefire:15 నెలల యుద్ధానికి తెర.. ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ప్రారంభం..

Gaza Ceasefire: ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధానికి బ్రేక్ పడింది. ఇరు వర్గాలు కాల్పుల విరమణ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయిలీ బందీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. హమాస్ తాము విడదల చేయాలని యోచిస్తున్న ముగ్గురు ఇజ్రాయిల్ బందీల పేర్లను ప్రకటించింది. దీంతో గాజాలో కాల్పులు విరమణకు మార్గం సుగమైంది.

ఆదివారం కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ముగ్గురు బందీలు..రోమి గోనెన్, ఎమిలీ డమారి, డోరాన్ స్టెయిన్‌బ్రెచర్‌లను విడుదల చేస్తామని హమాస్ చెప్పింది. సుమారు 3 గంటలు ఆలస్యంగా కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ 42 రోజులు పాటు సాగుతుంది. గాజాలో మొదటి దశ కాల్పుల విరమణ 11.15 గంటలకు అమలులోకి వస్తుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం తెలిపింది.

అంతకుముందు, హమాస్ విడుదల చేయాల్సిన 33 మంది బందీల జాబితాను అందచేసే వరకు గాజాలో పోరాటం సాగుతుందని ఇజ్రాయిల్ చెప్పింది. ఇది కాల్పులు విరమణను 2 గంటలకు పైగా ఆలస్యం చేసింది. దీనికి ముందు రోజు ఇజ్రాయిల్ దళాలు గాజాలో ఆపరేషన్, ఉగ్రవాద లక్ష్యాలను కొనసాగిస్తున్నట్లు తెలిపాయి. ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మునుపటి ప్రకటనకు మద్దతుగా, ఆదివారం తరువాత విడుదల చేయాల్సిన బందీల పేర్లను హమాస్ అప్పగించే వరకు కాల్పుల విరమణ ప్రారంభం కాదని అన్నారు.

ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. హమాస్ కిడ్నాప్ చేసిన 98 మంది ఇజ్రాయెల్ బందీలలో మొత్తం 33 మందిని విడుదల చేయనున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అదేవిధంగా, ఇజ్రాయెల్ కూడా ప్రస్తుతం అనేక జైళ్లలో ఉన్న దాదాపు 2,000 మంది పాలస్తీనియన్లను విడిపిస్తుందని అంచనా.