Leading News Portal in Telugu

Israel Releases 90 Palestinian Prisoners As Part Of Ceasefire Agreement


  • కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం..
  • బందీలను విడుదల చేస్తున్న ఇజ్రాయెల్- హమాస్..
Israel – Hamas: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న ఖైదీల విడుదల..

Israel – Hamas: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్‌- హమాస్‌లు తమ అధీనంలో ఉన్న బందీలను దశల వారిగా విడుదల చేస్తున్నారు. తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్‌ రిలీజ్ చేయగా.. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో 15 నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా స్వస్తి పలికినట్లైంది.

అయితే, ఆదివారం నాటి నుంచి అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు కొనసాగుతుంది. అప్పటిలోపు హమాస్‌ 33 మంది బందీలను, ఇజ్రాయెల్‌ దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేయనున్నాయి. మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని బెంజిమన్ నెతన్యాహూ సర్కార్ లో భాగస్వామి ఓజ్మా యేహూదిత్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆ పార్టీ తప్పుకుంది.

కాగా, 2023 అక్టోబర్‌ 7వ తేదీన పాలస్తీనాకు చెందిన హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై భీకర దాడులు చేసి సుమారు 1200 మందిని చంపడంతో పాటు వేల మంది గాయపడ్డారు. ఈ ఘటనలో కొంత మందిని తమ వెంట బందీలుగా పట్టుకుపోయారు. అయితే, దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ గాజాపై జరిపిన దాడుల్లో ఇ‍ప్పటి వరకు 47 వేల మంది దాకా చనిపోయినట్లు తెలుస్తుంది. తాజా కాల్పుల విరమణకు అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తిత్వం వహించడంతో ప్రస్తుతం గాజాలో శాంతి నెలకొనే అవకాశం కనిపిస్తుంది.