మహా కుంభమేళా నుంచి తేనెకళ్ల సుందరి మాయం.. కారణమేంటో తెలుసా? | heney eyes girl disappear from kumbh| reason| over| recognition| harrasment| hurdle
posted on Jan 21, 2025 3:47PM
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేలా.. అనేకానేక విషయాలలో ఈ కుంభమేళా దానికదే సాటి. ఈ కుంభమేళాకు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు ఇలా జనం ముందు ఎప్పుడో కానీ కనిపించని ఎందరెందరో వస్తారు. ఇలాంటి వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగులు తారు. కానీ మహాకుంభమేళా ఆరంభం నుంచీ వీళ్లెవరూ కాదు.. ఓ 16 ఏళ్ల అమ్మాయి.. అతి సాధారణ కుటుంబానికి చెందిన బాలిక కుంభమేళాకు వచ్చిన వారందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి జనం పోటీలు పడ్డారు.
అలా పోటీలు పడ్డవారిలో చిన్నా పెద్దా, ఆడా, మగా అన్న తేడా లేదు. ఆఖరికి విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఆ అమ్మాయిని ఒక్కసారి చూసి మాట్లాడి వీలైతే ఫొటో తీసుకోవాలని ఆరాటపడ్డారు. ఇంతకీ ఆమె ప్రత్యేకత ఏమిటి? అంటే ఎవరూ చెప్పలేరు. అతి సాధారణమైన ఆ అమ్మాయి సహజత్వం, కల్మషమెరుగని మందహాసం, మరీ ముఖ్యంగా తెనెకళ్లు.. అన్నిటికీ మించి అమాయకత్వం వెరసి ఆమె గరల్ ఆఫ్ ది సాయిల్. ఆ అమ్మాయిలోని ఈ సింప్లిసిటీ, ఈ సహజత్వమే అందరినీ ఆకర్షించింది. ఇంకే ముంది నెటిజనులు ఆ అమ్మాయికి మోనాలిసా అని పేరు పెట్టేశారు. ఆమె ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
కుంభమేళా ప్రారంభం నుంచీ సామాజిక మాధ్యమంలో ఆమె ఫొటోలే చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి తేనెకళ్ల సుందరి హఠాత్తుగా కుంభమేళా నుంచి మాయమైపోయింది. ఎందుకు, ఏమిటి అన్న ఆరా తీస్తే.. కుంభమేళాలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసేంత స్థాయిలో అరాచకం కూడా రాజ్యమేలుతోందన్న విషయం వెలుగులోనికి వచ్చింది. నభూతో నభవిష్యతి అన్న రీతిలో ప్రశాంతంగా కుంభమేళా నిర్వహణ అంటూ సొంత భుజాలను చరిచేసుకుంటున్న యూపీలోని యోగి సర్కార్ సిగ్గుతో తలవంచుకునేలాంటి సంఘటనలూ జరుగుతున్నాయని ప్రపంచానికి తెలిసింది.
పూసలూ, రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవనం సాగించే మోనాలిసా (తేనెకళ్ల సుందరి) మీడియాకు ముడి సరుకుగా మారిపోయింది. అంతే కాదు ఆకతాయిలకు టార్గెట్ కూడా అయిపోయింది. ఎక్కడపడితే అక్కడ ఆమెను అటకాయించడం, ఫొటోలు దిగాలని ఫోర్స్ చేయడం, వేధించడం ఎక్కువైపోయింది. దీనికి తోడు ఆమెలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా వెలుగొందిన రేఖ పోలికలు కనిపించడంతో ఫ్యూచర్ బాలీవుడ్ హీరోయిన్ అంటూ మీడియా ఊదరగొట్టేసింది.తమది దీంతో ఆమె అడుగు బయటపెట్టాలంటే బయపడే పరిస్థితి వచ్చింది. ఆమెను కాపాడుకోవడం ఎలాగో తెలియక ఆమె తల్లిదండ్రులు మధన పడ్డారు. చివరకు మహాకుంభమేళా నుంచి బిచాణా ఎత్తేశారు.