Leading News Portal in Telugu

ఈట‌ల దూకుడు వ్యూహం ఫ‌లిస్తుందా?! | etala rajender aggressive strategy| bjp| telangana| president


posted on Jan 23, 2025 4:54AM

తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్య‌నేత‌ల్లో బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఒక‌రు. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన ఈట‌ల‌.. తెలంగాణ‌ బీజేపీలో కీల‌క నేత‌గానూ కొన‌సాగుతున్నారు. సౌమ్యుడు, మృదు స్వ‌భావిగా ఆయ‌న‌కు  పేరుంది. అయితే, ప్ర‌స్తుతం ఈటల‌ త‌న రాజ‌కీయ పంథాను మార్చారు. గేరుమార్చి దూకుడు రాజ‌కీయాల‌కు పెద్ద‌ పీట వేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ లో వ‌చ్చిన ఈ అనూహ్య‌ మార్పును చూసి బీజేపీ నేత‌ల‌తోపాటు ఇత‌ర పార్టీల్లోని నేత‌లు సైతం ఆశ్చ‌ర్య పోతున్నారు. ఇంత‌కీ ఈట‌లలో అనూహ్య మార్పున‌కు కార‌ణం ఏమిట‌ని ఆరాతీస్తే.. పెద్ద ప్లానే ఉంద‌ని తెలుగస్తోంది. 

తెలంగాణ రాజ‌కీయాల్లో బీజేపీ వేగంగా ఎదుగుతోంది. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ రోజురోజు బ‌ల‌ప‌డుతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాక‌పోయినా.. ఆ త‌రువాత జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  స‌త్తా చాటింది. ప‌దిహేడు పార్ల‌మెంట్ స్థానాలకు గాను ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల త‌రువాత నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఆ పార్టీ కేంద్ర అధిష్టానం తెలంగాణకు నూత‌న అధ్య‌క్షుడ్ని నియ‌మించేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈట‌ల రాజేంద‌ర్ గేరుమార్చి త‌న‌లోని స‌రికొత్త రాజ‌కీయ కోణాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

ఈట‌ల రాజేంద‌ర్ రెండు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. ఎక్కువ కాలం ఆయ‌న రాజ‌కీయ జీవితం బీఆర్ఎస్ పార్టీలోనే కొన‌సాగింది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన ఈటల‌.. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంత‌రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావ‌డంలోనూ త‌న‌వంతు పాత్ర పోషించారు. ఆ త‌రువాత కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగానూ కొన‌సాగారు. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ త‌రువాత ఈట‌లనే అనే స్థాయికి ఆయ‌న చేరుకున్నారు. 2021లో పార్టీ అధినాయ‌క‌త్వంతో ఏర్ప‌డిన విబేధాల కార‌ణంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలోనూ ఈటల రాజేంద‌ర్ కీల‌క నేత‌గా కొన‌సాగుతూ వ‌స్తున్నారు. గ‌త‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఈట‌ల విజ‌యం సాధించారు.

 బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈట‌లకు ఆ సామాజిక వ‌ర్గాల నుంచి బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఉంది. బీసీల‌లోనే కాకుండా జ‌నాభా ప‌రంగా అత్యధిక సంఖ్యాకులున్న ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్‌కు.. రెడ్డి సామాజిక వ‌ర్గంతోకూడా సంబంధాలున్నాయి. ఎందుకంటే.. ఆయ‌న స‌తీమ‌ణి రెడ్డి సామాజిక వ‌ర్గంకు చెందిన‌వారు. ఈ క్ర‌మంలో బీజేపీ తెలంగాణ‌ అధ్య‌క్ష బాధ్య‌త‌లను ఈటల‌కు అప్ప‌గిస్తార‌ని తొలుత ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఆయ‌న దూకుడు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటార‌ని, అలా అయితే, పార్టీని క్షేత్ర‌స్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డం సాధ్యం కాద‌న్న భావ‌న‌లో కేంద్ర పార్టీ పెద్ద‌లు ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే ఈటల ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా రాజ‌కీయాల్లో త‌న గేరు మార్చిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. 

పార్టీ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాలంటే దూకుడుగా ఉండాలనీ,  కార్య‌క‌ర్త‌ల‌కు, ప్రజలకు అండ‌గా ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వంపైకి దూకుడుగా వెళ్లాలి. గ‌తంలో బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు  బండి సంజ‌య్ తన దూకుడుతో రాష్ట్రంలో బీజేపీ పేరు మారుమోగిపోయేలా చేశారు.  ప్ర‌భుత్వం ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నించ‌డంలో అప్పట్లో బండి సంజ‌య్ చాలా దూకుడుగా వ్యవహరించారు. ప‌రుష ప‌ద‌జాలంతో ప్ర‌భుత్వాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు నిల‌దీస్తూ వెళ్లారు. ప్ర‌స్తుతం తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సైతం గ‌తంలో దూకుడుగా రాజ‌కీయాలు చేసి స‌క్సెస్ అయ్యారు. ఏపీలో నారా లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఇలా ప్ర‌తీ ఒక్క‌రూ అదే తీరుతో  ప్ర‌జానాయ‌కులుగా ఎదిగారు. తెలంగాణ అధ్య‌క్షుడిగా అలాంటి వ్య‌క్తినే ఎంపిక చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ు‌. ఈ క్ర‌మంలోనే ఈట‌ల త‌న రాజ‌కీయ పంథాను మార్చుకున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.

రెండురోజుల క్రితం పేద ప్రజలు కొనుక్కున్న స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు వారికి అనుమతులు రాకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ రియల్‌ వ్యాపారి అనుచరుడిపై ఈట‌ల చేయి చేసుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయాల్లో ఈట‌ల పేరు మారుమోగిపోతుంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సౌమ్యుడిగా పేరున్న ఆయ‌న‌.. ఉన్న‌ట్లుండి త‌న రాజ‌కీయ పంథాను మార్చ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిలో మార్పు రావ‌డానికి బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వే కార‌ణ‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మ‌రి.. ఈట‌ల వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుంద‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త రావాలంటే   కొద్ది రోజులు ఆగాల్సిందే.