నిన్నటి దాకా దావోస్ లో.. ఇప్పుడు ఢిల్లీలో బాబు బిజీబిజీ | cbn busy in delhi| fourdays| davos| now| hastina| union| ministers
posted on Jan 24, 2025 9:45AM
రాష్ట్ర ప్రయోజనాలు తప్ప విశ్రాంతి, విరామం అన్న మాటే ఆయనకు తెలియదు. వరుసగా నాలుగు రోజుల పాటు దావోస్ లో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు అక్కడ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో కూడా క్షణం తీరిక లేకుండా కేంద్ర మంత్రులతో వరస భేటీలకు రెడీ అయిపోయారు. దావోస్ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు గురువారం (జనవరి 23) ముగిసింది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆ నాలుగు రోజులూ చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో పాల్గొని ఏపీ బ్రాండ్ ను సక్సెస్ ఫుల్ గా ప్రమోట్ చేశారు.
ఈ సదస్సు వేదికగా రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అన్న ప్రకటనలేవీ వెలువడలేదు. ఆర్భాటపు ప్రకటనల జోలికి పోకుండా బ్రాండ్ ఏపీ ప్రమోషన్.. వాస్తవాల ప్రాతిపదికన తాము చర్చించిన సంస్థలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడుల ప్రకటన చేయాలని కోరారు. చంద్రబాబు దావోస్ పర్యటన లక్ష్యం నెరవేరింది. ప్రపంచ దిగ్గజ సంస్థలు త్వరలో తమ ప్రతినిథి బృందాన్ని ఏపీకి పంపనున్నట్లు పేర్కొన్నాయి. వాస్తవానికి దావోస్ ఆర్థిక సదస్సు ఉద్దేశం కూడా అదే.
దావోస్ వేదికగా ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోనం సదస్సు పెట్టుబడిదారులు, ఆ పెట్టుబడులను ఆకర్షించాలనుకునేవారికి మధ్య ఓ వారధి. ఈ సదస్సు వేదికగా ఇటు ఇన్వెస్టర్లు, అటు ఆ ఇన్వెస్ట్ మెంట్లను ఆకర్షించాలనుకునే వారు తమ తమ అవకాశాలను అక్కడ ప్రజంట్ చేసుకుంటారు. హడావుడి ఒప్పందాల కంటే వాస్తవాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి చేసుకునే ఒప్పందాలే గ్రౌండ్ అవుతాయి. అలా కాకుండా సదస్సులో ఆర్భాటంగా చేసుకునే ఎంవోయూలలో గ్రౌండింగ్ అయ్యేవి చాలా చాలా తక్కువ. ఆ రకంగా చంద్రబాబు దావోస్ పర్యటనలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ ను సక్సెస్ ఫుల్ గా చేశారనే చెప్పాలి. ఇక ముందు ఏపీకి కంపెనీల ప్రతినిధులు క్యూ కడతారని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన విజన్, ఆయన అనుభవం, ఆయన అమలు చేసే ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానాల గురించి తెలియని పారిశ్రామిక వేత్త లేరంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన ఘనత ఆయనదే.
ఇప్పుడు ఆయన బ్రాండ్ ఏపీ గురించి ప్రమోట్ చేశారు. తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని గురువారం (జనవరి 23) అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇక శుక్రవారం (జనవరి 24) ఆయన హస్తినలో పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపి అదే రోజు సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు. హస్తినలో ఆయన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషీ తదితరులతో భేటీ అవుతారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తోనూ భేటీ అవుతారు.