Leading News Portal in Telugu

IND vs ENG India Aims for Series Advantage in 2nd T20 Against England at Chepauk


  • నేడే భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్.
  • చెన్నై వేదికగా టీ20 మ్యాచ్.
  • సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్.
IND vs ENG: భారత్ జోరును ఇంగ్లాండ్ అడ్డుకుంటుందా! నేడే రెండో టి20

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమ్ ఇండియా, రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలని చూస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో పునరాగమనం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

ఇకపోతే, చెన్నై పిచ్ స్పిన్ బౌలర్లకు ఎక్కువ మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మరోసారి ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ ఆడే అవకాశాలు చాలా తక్కువనే చెప్పవచ్చు. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హార్దిక్ పాండ్యా రూపంలో రెండో పేసర్‌తో భారత్ బరిలోకి దిగనుంది. ఇక ఇరు జట్ల మధ్య టి20లో రికార్డ్స్ పరంగా చూస్తే..

భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 25 టీ20 మ్యాచ్‌లు జరగగా.. వీటిలో టీమ్ ఇండియా 14 మ్యాచ్‌లు గెలిచి ఆధిపత్యం చెలాయించగా, ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు భారత్‌పై 11 విజయాలు సాధించింది. ఇక చెన్నైలోని స్టేడియం ఇప్పటివరకు కేవలం రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో భారత్ ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడిపోవాల్సి వచ్చింది. 2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1 పరుగు తేడాతో ఓడిపోగా, చివరిసారిగా 2018లో చెపాక్‌లో వెస్టిండీస్‌తో టీమ్ ఇండియా తలపడింది. ఆ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. నేడు మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది.