Leading News Portal in Telugu

Tamil Nadu Women Kabaddi Players Attacked During Inter-University Games Match in Punjab


  • పంజాబ్‌లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ టోర్నీ.
  • తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై దాడి
  • ఘటనపై స్పందించిన తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.
Inter University Games: మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి

Inter University Games: పంజాబ్‌లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ మ్యాచ్ సందర్భంగా తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై దాడి జరగడం కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన క్రీడా ప్రపంచానికి చేదు అనుభవంగా మిగిలింది. మ్యాచ్‌ రెఫరీ తీసుకున్న నిర్ణయం పట్ల క్రీడాకారులు అసంతృప్తిగా ఉండటంతో ఈ గొడవ ప్రారంభమైందని సమాచారం. మదర్ థెరిసా విశ్వవిద్యాలయం, పెరియార్ విశ్వవిద్యాలయం, అలగప్ప విశ్వవిద్యాలయం, భారతియార్ విశ్వవిద్యాలయాలకు చెందిన మహిళా క్రీడాకారిణులు పంజాబ్‌లో నిర్వహించిన ఉత్తర మండలం అంతర్ విశ్వవిద్యాలయ అండ్ అఖిల భారత అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2024-25లో పాల్గొనేందుకు వచ్చారు.

ఇక ఈ ట్రోఫీలో మదర్ థెరిసా విశ్వవిద్యాలయం జట్టు సభ్యులపై ప్రత్యర్థి జట్టు సభ్యులు దాడి చేయడం గొడవకు కారణమైంది. సమాచారం ప్రకారం, దర్భంగ విశ్వవిద్యాలయ జట్టుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో మదర్ థెరిసా జట్టు సభ్యురాలిపై “ఫౌల్ అటాక్” జరిగిందని సమాచారం. దీనిపై రెఫరీ తీసుకున్న నిర్ణయం మరింత ఉద్రిక్తత కలిగించింది. రెండు జట్లు ఒకదానిపై ఒకటి దాడి చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలో క్రీడాకారిణులు, కొంతమంది వ్యక్తులతో వాగ్వాదం చేస్తూ, ఘర్షణ పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సిరలు అయ్యాయి. ఆ వ్యక్తులు అధికారులా, లేక ప్రేక్షకులా అన్న విషయం స్పష్టంగా తెలియదు. కొంతమంది కుర్చీలను కూడా విసరడం కూడా వీడియోలో కనిపించింది.

ఈ ఘటనపై తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. క్రీడాకారిణులందరూ సురక్షితంగా ఉన్నారని, త్వరలోనే వారు రాష్ట్రానికి తిరిగి వస్తారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “సమాచారం వచ్చిన వెంటనే మేము కోచ్‌ను సంప్రదించామని, తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ (SDAT), జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సంప్రదించి క్రీడాకారిణుల భద్రతను పర్యవేక్షించామని తెలిపారు. వారు త్వరలో ఢిల్లీ నుంచి తమిళనాడుకు రానున్నారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.