ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం..ప్రముఖుల హాజరు | at home in ap rajbhawan| cbn| pawankalyan. highcourt| chief| justice| lokesh
posted on Jan 27, 2025 6:12AM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం (జనవరి 26) సాయంత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో జరిగిన ఈ ఎట్ హోం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖుల రాకతో ఈ కార్యక్రమం సందడిగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. అలాగే గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో చంద్రబాబు కొద్ది సేపు చర్చించారు.
అంతకు ముందు అంటే ఆదివారం (జనవరి 26) ఉదయంవిజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ప్రజల ఆకాంక్షలు నెరేవేర్చేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్న ఆయన, గత ప్రభుత్వం ఇష్టారీతిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఒక్కటొక్కటిగా సమస్యలను అధిగమిస్తూ ప్రజారంజక పాలన సాగిస్తోందని ప్రశంసించారు.