Leading News Portal in Telugu

Yannick Sinner Win Australian Open 2025 Title with Dominant Performance


  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025 విజేతగా యానిక్‌ సినర్‌.
  • తుది పోరులో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై 6-3, 7-6(7-4), 6-3 తేడాతో విజయం.
  • వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను దక్కించుకున్న యానిక్‌ సినర్‌.
Australian Open 2025: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025 విజేతగా యానిక్‌ సినర్‌

Australian Open 2025: వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ యానిక్‌ సినర్‌ (ఇటలీ) (Yannick Sinner) తన అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుది పోరులో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) (Alexander Zverev)పై 6-3, 7-6(7-4), 6-3 తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో సినర్ తన మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. అతడే మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన తొలి ఇటాలియన్ ఆటగాడిగా యానిక్‌ సినర్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2024లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన సినర్‌ తన గెలుపు ప్రయాణాన్ని కొనసాగించాడు. టైటిల్ ఫేవరేట్‌గా ఈ టోర్నీ బరిలోకి దిగిన సినర్‌ తుది పోరులోనూ తన మెరుగైన ఆటతీరుతో టైటిల్ ను కైవసం చేసుకున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి సెట్ హోరాహోరీగా సాగగా.. మొదటి సెట్‌లో 3-3 స్కోర్ వద్ద సమానంగా ఉన్నప్పటికీ, ఆపై సినర్ దూకుడుగా ఆడి సెట్‌ను 6-3 తేడాతో గెలిచాడు. ఆపై రెండో సెట్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. జ్వెరెవ్‌ ఒక దశలో 4-3 ఆధిక్యంలో నిలిచినా, చివరకు 6-6తో సెట్ టై బ్రేకర్‌కు వెళ్లింది. టై బ్రేకర్‌లో తొలి ఆధిక్యాన్ని సాధించిన జ్వెరెవ్‌ను అధిగమించి సినర్‌ సెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఇక చివరగా మూడో సెట్ లో జ్వెరెవ్‌ శ్రద్ధగా ఆడినా సరైన జోరును కొనసాగించలేకపోయాడు. దాంతో సినర్ తన స్పీడ్ ను కొనసాగించి 6-3తో ఈ సెట్‌ను ముగించాడు.

మ్యాచ్ మొత్తంలో సినర్ 6 ఏస్‌లు కొట్టగా, జ్వెరెవ్‌ 12 ఏస్‌లు కొట్టాడు. కానీ, అనవసరమైన తప్పిదాలు చేసిన జ్వెరెవ్‌ ఈ పోరులో విజయాన్ని అందుకోలేక పోయాడు. సినర్ తన వ్యూహాలతో జ్వెరెవ్‌ సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసి మ్యాచ్‌ను తనకు అనుకూలంగా చేసుకున్నాడు. ఇప్పటికే రెండు సార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరిన జ్వెరెవ్, మూడోసారి కూడా రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. ఈ ఓటమి అతడికి మరోసారి నిరాశను మిగిల్చింది.