Leading News Portal in Telugu

India-Bangladesh Row: Pakistani Military Officials Visit Border Region Near North-East; Threaten India’s “Chicken Neck”


  • భారత్ వ్యతిరేకంగా పాక్-బంగ్లా కుట్రలు..
  • సరిహద్దుల వద్దకు పాకిస్తాన్ సైనికాధికారులు..
  • చికెన్స్ నెక్‌తో సహా త్రిపుర సరిహద్దులకు ఐఎస్ఐ..
India-Bangladesh: భారత్‌పై పాక్-బంగ్లా కుట్రలు.. సరిహద్దుల వద్దకు ఐఎస్ఐ.. చికెన్స్ నెక్, త్రిపుర టార్గెట్..?

India-Bangladesh: బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య స్నేహబంధం రోజురోజుకు పెరుగుతోంది. అదే సమయంలో అక్కడి జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)లు భారత వ్యతిరేకతను పెంచుతోంది. షేక్ హసీనా పదవి పోయిన తర్వాత అక్కడి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ యూనస్ పాకిస్తాన్‌తో అంటకాగుతున్నాడు. 1970కి ముందు పాకిస్తాన్ సాగించిన అకృ‌త్యాలను బంగ్లాదేశ్ మరించిపోయింది. ఏ దేశమైతే తమకు స్వాతంత్రం, స్వేచ్ఛను ప్రసాదించిందో ఇప్పుడు ఆ దేశంపైనే వ్యతిరేకత ఉంది.

గత కొన్ని రోజులుగా బంగ్లా-పాక్ మధ్య పెరుగుతున్న స్నేహం భారత్‌కి ఆందోళనకరంగా మారింది. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు పాకిస్తాన్‌కి, పాకిస్తాన్ ఆర్మీ, దాని గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) బంగ్లాదేశ్‌ పర్యటనలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ రెండు దేశాల మధ్య సముద్రయానంతో పాటు నేరుగా విమాన సేవల్ని ప్రారంభించారు. గతంలో పాక్ పౌరులపై వీసా ఆంక్షలు ఉండేవి, ఇప్పుడు వాటిని బంగ్లాదేశ్ తొలగించింది. మరోవైపు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి భారీగా మందుగుండు, ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. చైనా-పాక్ సంయుక్తంగా డెవలప్ చేసిన యుద్ధ విమానం JF-17ని కొనుగోలు చేయాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.

ఐఎస్ఐ పర్యటన:

అనేక దశాబ్ధాలుగా ఎప్పుడూ లేని విధంగా ఐఎస్ఐ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ బంగ్లాదేశ్ వెళ్లారు. ఆయనకు అక్కడి ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ ఫైజుర్ రెహ్మాన్ ఘన స్వాగతం పలికారు. అయితే, ఇప్పుడు ఐఎస్ఐ చేసిన పర్యటన ఆందోళనకరంగా మారింది. జనవరి 21న ఢాకా చేరుకున్న ఐఎస్ఐ చీప్ భారతదేశ ఈశాన్య సరిహద్దుల్లోని ‘‘చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్’’ని సందర్శించారు. ఇది మన దేశంలోని త్రిపురతో సరిహద్దు కలిగి ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని మళ్లీ ప్రేరేపించేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద, తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా వారికి ఆయుధ సాయం చేయడానికి పాక్ సిద్ధమైంది.

మరోవైపు భారత వ్యూహాత్మక ప్రాంతం, ఈశాన్య ప్రాంతాన్ని మిగత భారతదేశంతో కనెక్ట్ చేస్తున్న ఇరుకైన మార్గం ‘‘చికెన్స్ నెక్’’ లేదా ‘‘సిలిగురి కారిడార్’’ సమీపంలోకి పాక్ ఐఎస్ఐ రావడం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ రంగ్‌పూర్ ప్రాంతంలో ఐఎస్ఐ సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఇది మనదేశంలోని సిలిగురికి కేవలం 130 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రాంతాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని, ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదాన్ని పెంచి పోషించి, భారత్‌తో ప్రాక్సీ వార్ చేసేందుకు పాక్-బంగ్లాలు కలిసి పనిచేస్తున్నట్లు మన వ్యూహకర్తలు చెబుతున్నారు.