Leading News Portal in Telugu

రాజౌరి మిస్టరీ మరణాలు.. న్యూరో ట్యాక్సినే కారణమా?.. కుట్ర కోణం ఉందా? | rajouli mystery deaths| conspiracy| angle| neuro


posted on Jan 28, 2025 9:13AM

జమ్మూ కాశ్మీర్ లో వరుసగా సంభవిస్తున్న మరణాల మిస్టరీ వీడలేదు. వైద్య నిపుణులు మరణాలకు కారణం న్యూరోట్యాక్సిన్ అని చెబుతున్నారు. కుట్ర కోణం కూడా ఉండి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. రాజౌరీలోని బుధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో ఒకే విధమైన ఆరోగ్య సమస్యలతో ఏకంగా 17 మంది మరణించారు. ఈ మృతులంతా మూడు కుటుంబాలకు చెందిన వారే. మృతులలో 14 మంది పిల్లలే.

ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించడానికి 11 మందితో కూడిన బృందం దర్యాప్తు చేస్తున్నది. వైద్య నిపుణులు న్యూరో  ట్యాక్సిన్ వల్ల ఈ మరణాలు సంభవించాయని చెబుతున్నప్పటికీ కుట్ర కోణంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులందరూ కూడా ఒకే రకమైన అనారోగ్య లక్షణాలతో మరణించారు. మెదడు వాపు కారణమై ఉండొచ్చని కూడా అంటున్నారు.  బాధితుల శాంపిల్స్ లో ఎటువంటి వైరస్, బ్యాక్టీరియాను గుర్తించలేదు. వీరి శాంపిల్స్ పరీక్షించిన పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించారు. ఈ పరీక్షల్లో మృతులందరిలో మెదడు దెబ్బతినడానికి దోహదం చేసే న్యూరోట్యాక్సిన్ ల ఉనికిని గుర్తించారు.  

తాజాగా ఆరుగురు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఈ ఆరుగురినీ ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  అలాగే దాదాపు 300 మందిని క్వారంటైన్ కు తరలించారు. బాధిత కుటుంబాలతో తరచూ కలుస్తుండే వారితో పాటు, మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. మొత్తంగా బుధాల్ గ్రామాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు.