posted on Jan 28, 2025 1:49PM
గ్రేటర్ హైద్రాబాద్ లో రాజకీయాలు వేడెక్కాయి. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన హైద్రాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి పదవీగండం పొంచి ఉంది. సీనియర్ రాజకీయనాయకుడు కెకె కూతురు అయిన విజయలక్ష్మి పదవీకాలం ఇంకా ఉంది. అయితే జీహెచ్ ఎంసి చట్టాల ప్రకారం నాలుగేళ్లు పూర్తయితే అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించాలి. వచ్చే నెల (ఫిబ్రవరి 10) నాలుగేళ్లు పూర్తి కానుంది. కాబట్టి బిఆర్ ఎస్ అవిశ్వాసం పెట్టే ప్లాన్ లో ఉంది. ఈ అవిశ్వాసాన్ని బలపరచడానికి అప్పటి మిత్రపక్షమైన ఎంఐఎం కాంగ్రెస్ చంకలో చేరడంతో ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలు కూడా తక్కువే. అయితే బిఆర్ఎస్ కు బిజెపి సపోర్ట్ చేయనుందని చెబుతోంది. బిఆర్ఎస్ కేవలం బిజెపి బలం మీదే ఆధారపడింది. ఒకరకంగా చెప్పాలంటే బిఆర్ఎస్ కు బిజెపి మిత్ర పక్షమైనప్పటికీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తర్వాత ఈ రెండు పార్టీల బంధానికి బీటలు వారింది. జిహెచ్ ఎంసిలో 150 కార్పోరేటర్లకు గాను ఇద్దరు ఎమ్మెల్యేలు కావడం, మరో ఇద్దరు చనిపోవడంతో ఈ సంఖ్య 146కి పడిపోయింది. 50 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 196 మంది ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్ సీలు ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి ఎన్నికైన 41 మంది కార్పోరేటర్లు అసమ్మతి తీర్మానానికి సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఎంఐఎం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ ఎస్ ఘోర పరాజయం తర్వాత మజ్లిక్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. 2020 డిసెంబర్ లో జరిగిన జిహెచ్ ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పోరేటర్లు గద్వాల విజయలక్ష్మి, శ్రీలతా శోభన్ రెడ్డిలు మేయర్ డిప్యూటి మేయర్ పదవులు అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వీరిరువురు కాంగ్రెస్ పార్టీలో మారారు. వీరు కాంగ్రెస్ పార్టీలో మారడానికి మాజీ బిఆర్ఎస్ పొలిట్ బ్యురో సభ్యులైన కె. కేశవరావు ముఖ్యభూమిక వహించారు. తనకు పదవీగండం ఉందని వస్తున్న వార్తలను మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఖండించారు. ఆమెకు కాంగ్రెస్ కార్పోరేటర్లు పూర్తి మద్దతుగా నిలబడటంతో గద్వాల విజయ లక్మి పదవికి ఎటువంటి ఢోకా లేదని సమాచారం. అవిశ్వాసతీర్మానం పెట్టాలి అని భావిస్తున్న బిఆర్ఎస్ కు 42 కార్పోరేటర్లు, 29 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బిఆర్ఎస్ కుమరో 27 మంది సభ్యులు కావాలి. ఎంఐఎం కాంగ్రెస్ కు దగ్గరవడంతో బిఆర్ ఎస్ బిజెపి బలం మీద ఆధారపడింది. బిజెపి అధిష్టానం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మేయర్ కు పదవి గండం విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.