Leading News Portal in Telugu

KTR React About Gongadi Trisha’s Century Record in Under 19 Womens T20 World Cup 2025


  • అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్న త్రిష
  • 5 మ్యాచ్‌లలో 230 పరుగులు
  • హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్‌
KTR-Trisha: త్రిష.. నిన్ను కెప్టెన్‌గా చూస్తామని ఆశిస్తున్నా: కేటీఆర్‌

అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ 2025లో తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష అదరగొడుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన త్రిష 230 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌పై (40), శ్రీలంకపై (49)పై కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన తెలుగమ్మాయి.. స్కాట్లాండ్‌పై సెంచరీ (110) చేసింది. 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో శతకం బాదింది. దాంతో అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి మహిళగా త్రిష రికార్డు సృష్టించింది. ఈ రికార్డుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌లో గొంగిడి త్రిష అద్భుతమైన ఫీట్‌ సాధించిందని కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా కొనియాడారు. ‘త్రిష అద్భుతంగా ఆడుతున్నావ్. అద్భుతమైన ఫీట్ సాదించావు. దేశ గౌరవాన్ని పెంచావు, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేశావ్. ఐసీసీ అండర్‌-19 టీ20 మహిళా ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్ఉమెన్‌గా రికార్డ్ సాధించి.. ఎంతోమంది మహిళలకు, మహిళా క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచిన మీకు మనస్పూర్తిగా అభినందనలు. మరికొన్నాళ్లలోనే టీమిండియా మహిళా క్రికెట్ జట్టులో అడుగెడుతావని, కెప్టెన్‌గా చూస్తామని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

అండర్‌-19, మహిళా టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సాధించినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని త్రిష తెలిపింది. విమెన్ అండర్‌-19 టోర్నీలో మంచి ప్రదర్శన చేసి భారత మహిళల జట్టుకు ఎంపిక కావాలని, వచ్చే ప్రపంచకప్‌ స్క్వాడ్‌లో తన పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చానని చెప్పింది. తన లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నందుకు సంతోషముగా ఉందని పేర్కొంది.