Leading News Portal in Telugu

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇక అంతే సంగతులా? | accused persons in phone taping case| comming out on bail| onebyone| inquiry| salow


posted on Jan 30, 2025 3:50PM

తెలంగణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఒకరి తరువాత ఒకరు బెయిలుపై బయటకు వచ్చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అమెరికా నుంచి వెనక్కు రప్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో ఇంక ఈ కేసు నీరుగారిపోయినట్లేనా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒక విషయం మాత్రం రూఢీ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద పెద్ద తలకాయల ప్రమేయం ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎంత మంది ఫోన్లు ట్యాప్ చేశారన్నది తేలియరాలేదు కానీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారే కాదు, న్యాయమూర్తులు, సినీ తారలు ఇలా ఒకరనేమిటి  చాలా చాలా మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని తేలింది. ఇతర రాష్ట్రాలలో గవర్నర్లుగా ఉన్న వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలు ఉన్నారు. 

ఈ కేసు దర్యాప్తు ఆరంభంలో చాలా చాలా వేగంగా సాగింది. పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం కూడా జరిగింది. అయితే ఆ తరువాత కేసు దర్యాప్తులో పురోగతి మందగించింది. అందుకు ప్రధాన కారణం ఈ కేసులో అత్యంత కీలకమైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్  ప్రభాకర్ రావు. ఆయన చల్లగా అమెరికా జారుకున్నారు. ఆయనను అక్కడ నుంచి వెనక్కు రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. అలాగే ఇదే కేసులో కీలకమైన మరో నిందితుడు ప్రవీణ్ రావు కూడా పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కనిపెట్టడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో చార్జిషీట్ అయితే దాఖలైంది కానీ దర్యాప్తు పురోగతి లేకుండా పోయింది. దీంతో అరెస్టైన నిందితులు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు.   తిరపతన్నకు కండీషన్ బెయిలు లభించిన తరువాత   ఈ కేసులో మరో ఇద్దరు అధికారులకు కూడా తెలంగాణ హైకోర్టు బెయిలు ఇచ్చింది.  మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులకు  ఒక్కొక్కరికి రూ.లక్ష పూచికత్తుతో పాటు పాస్‌పోర్ట్‌లు అధికారులకు హ్యాండోవర్ చేయాలని,  సు దర్యాప్తుకు పూర్తి సహకారం అందించాలని,  సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతులు విధిస్తూ తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.