Leading News Portal in Telugu

ఆశల పల్లకిలో మధ్యతరగతి జీవులు.. నిర్మలమ్మ పద్దుపై సర్వత్రా ఆసక్తి! | middle class hopes on union budget| finance| minister| nirmala| sitaraman


posted on Feb 1, 2025 8:42AM

కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ వరుసగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ప్రవేశపెట్టనున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అన్ని వర్గాలలో ఈ బడ్జెట్ పై విపరీతమైన ఆశలు ఉన్నాయి. అన్ని వర్గాల ఆకాంక్షలనూ నెరవేర్చేలా బడ్జెట్ ఉండబోతోందన్న అంచనాలూ ఉన్నాయి.

లోక్ సభలో బీజేపీకి స్వయంగా పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ప్రభుత్వ మనుగడ ప్రధానంగా తెలుగుదేశం, జేడీయూ వంటి పార్టీల మద్దతుపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, బీహార్ లకు కేటాయింపుల్లో సింహభాగం దక్కే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో గతంలోలా మోడీ సర్కార్ పై ప్రజలలో సంపూర్ణ విశ్వాసం కొరవడటానికి కారణాలను అన్వేషించిన బీజేపీ అగ్రనాయకత్వం ఈ సారి బడుగు, బలహీన, మధ్య తరగతిపై వరాల జల్లు కురిపించేలా బడ్జెట్ ఉంటుందన్న అంచానాలూ ఉన్నాయి.  

శనివారం (ఫిబ్రవరి 1) ఉదయం 11గంటలకు కేంద్ర విత్త మంత్రి  నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.  దేశవ్యాప్తంగా అన్ని వర్గాలూ అంటే బడుగు,బలహీన మధ్యతరగతి, పారిశ్రామికవర్గాల నుంచి వేతన జీవుల వరకూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో తమకు  ప్రయోజనం కలిగించే ప్రకటనలు ఉంటాయని ఆశిస్తున్నారు.  విశ్వసనీయ సమాచారం మేరకు నిర్మలమ్మ పద్దులో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు పలు అంశాల్లో ఊరట లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వ్యవసాయదారులు, మహిళలు, పేదవర్గాలు, యువతపై ప్రత్యేక దృష్టి పెట్టి మరీ బడ్జెట్ ను రూపొందించిననట్లు తెలుస్తోంది. ఆర్థిక వృద్ధిరేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పతనమైన పరిస్థితుల్లో దానిని పెంచడం, అలాగే అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్.. ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో  నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి కనిపిస్తోంది. 

 ఇక బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు అలాగే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసగం బట్టి చూస్తే ఈ సారి బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ముఖ్యంగా ఆదాయపన్ను విధానంలో భారీ సంస్కరణలకు ఈ బడ్జెట్ తెరతీస్తుందని అంటున్నారు. అలాగే పన్ను శ్లాబుల విషయంలో కూడా వేతన జీవులకు మంచి వెసులుబాటు ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  ఇక విత్తమంత్రి నిర్మలాసీతారామన్ పద్దుపై తెలుగు రాష్ట్రాలూ ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలవరం, అమరావతిలకు మరిన్ని నిధులను కేంద్రం కేటాయిస్తోందని ఆశిస్తోంది.