Leading News Portal in Telugu

ఆలనాపాలనా లేని అపురూప శిల్పాలు | preserve ancient artifacts| pleach| india| ceo| doctor| siva| nagi


posted on Feb 2, 2025 4:28PM

ముళ్ల కంచెలో ముచ్చటైన శిల్పాలు

నిర్లక్ష్యపు నీడలో కీ.శ. 9వ శతాబ్ది రాష్ట్రకూట శిల్పాలు

1100 ఏళ్ల పురాతన శిల్పాలను పరిరక్షించుకోవాలి

ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి

కర్నూలు నగరానికి దక్షిణంగా పాతిక కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో రాష్ట్ర కూటుల అంటే 9వ శతాబ్దపు అపురూప శిల్పాలు ఆలనాపాలనా లేకుండా పడి ఉన్నాయి. నిర్లక్ష్యానికి గురైన వారసత్వ స్థలాలు, కట్టడాలు, శిల్పాలను గుర్తించి, వాటి చారిత్రక ప్రాధాన్యత, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించే ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిట్ కార్యక్రమంలో భాగంగా  ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 2) నాయకల్లు గ్రామాన్నిసందర్శించారు. అపురూప శిల్పాలు ఆలనా పాలనా లేకుండా పడి ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలాల్లో ఉన్న శిథిల శివలయాలు, విగ్రహాలను గుర్తించారు. 

గ్రామానికి ఉత్తరంగా ఉన్న కల్లాల వద్ద ముళ్ల కంచెల్లో ఉన్న రాష్ట్రకూటల కాలం నాటి నిలువెత్తు ఎర్ర ఇసుకరాతి శివ ద్వారపాలకుడు, నల్ల శాసనపు రాతిలో చెక్కిన రెండు మహిషాసుర మర్ధిని శిల్సాలు, వీరగల్లు శిల్పం, పోలాల్లో ఉన్న శిథిల శివాలయాల పక్కన ముళ్లపొదల్లో చిక్కుకున్న అందమైన నంది విగ్రహం, 1100 ఏళ్ల నాటి చరిత్ర, సంస్కృతికి అద్దం పడుతున్నాయన్నారు.

 రెండు మహిషాసుర మర్దిని విగ్రహాలు అలనాటి శక్తి ఆరాధనను, శతృవులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీరుడు విజయస్వర్గాన్ని అందుకోగా, అతడికి అప్సరసలు పరిచర్యలు చేస్తున్నట్లు తెలిపే నిలువెత్తు వీరగల్లు శిల్పం అలనాటి వీరాదరణను తెలియజేస్తున్నాయన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ కళా ఖండాలను గ్రామంలోకి తరలించి, పీఠాలపై నిలబెట్టి కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాని శివనాగిరెడ్డి గ్రామస్తులను కోరారు.