Leading News Portal in Telugu

పెద్దిరెడ్డిపై నాగబాబు ఫైర్.. ఓ రేంజ్ లో ఉందిగా! | nagababu criticse peddaireddy ramachandrareddy| janamloki| janasena


posted on Feb 3, 2025 1:56PM

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ లో అత్యంత కీలక భాగస్వామి జనసేన అనడంలో సందేహం లేదు. ఆ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ.. పొత్తులో భాగంగా జనసేన త్యాగాలకు సిద్ధపడి అన్ని స్థానాలలోనే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. ఆ ఎన్నికలలో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు సృష్టించింది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీసీ సర్కార్ ఎన్నికలలో పరాజయం కావడానికి జనసేన చొరవ తీసుకుని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా, బీజేపీని కూడా పొత్తులోకి తీసుకురావడం కూడా ఇక కారణం. ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఇప్పుడు జనంలో మమేకం కావడానికి తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. జనంలోకి జనసేన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా జనసేన పుంగనూరు నియోజకవర్గంలో ఆదివారం భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు హాజరయ్యారు. అసలు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ఆయనే ముందుండి నడిపించనున్నట్లు  జనసేన వర్గాలు చెబుతున్నాయి.  

పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అయిన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా పుంగనూరు సమావేశంలో నాగబాబు విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినిక అడవి దొంగగా అభివర్ణించారు. మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటన వెనుక కుట్ర ఉందని.. ఆ కుట్రదారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

పుంగనూరు పుడింగిగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుర్మార్గాలు, దురాగతాలపై తనకు వివరించిన స్థానికులు ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండాలని తనకు సూచించారని చెప్పిన నాగబాబు తనకు భయం లేదని చెప్పారు. పెద్దిరెడ్డి కాదు.. వైసిపీ అధినేత జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా తాను భయపడలేదనీ, ఆఫ్ట్రాల్ పెద్దిరెడ్డి ఎంత అని అన్నారు. నీతిగా, నిజాయతీగా ఉండే వారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న నాగబాబు.. జనసేనాని పవన్ కల్యాణ్ నాయకత్వంలో జనసేన క్యాడర్, లీడర్ అందరూ కూడా నీతి మార్గాన్నే అనుసరిస్తారన్న పవన్ కల్యాణ్ అందుకే జనసేన పార్టీకి భయమన్నదే లేదని ఉద్ఘాటించారు.

తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పెద్దిరెడ్డిపై విమర్శల దాడిని ఉధృతం చేసిన నాగబాబు  గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టారని ఆరోపించారు. జనం ఓడించిన తరువాత ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాలేదనీ, ప్రజలకు మొహం చాటేసి భయంభయంగా నక్కినక్కి బతుకీడుస్తారని ఎద్దేవా చేశారు. జగన్ కే కాదు జగన్ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీకి హాజరై ప్రజల తరఫున మాట్లాడే ధైర్యం లేదని నాగబాబు దుయ్యబట్టారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన సాగిస్తోం దన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా చేస్తోందన్నారు. పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్ సర్కార్ కు నాలుగేళ్లు పడితే.. ఎన్డీయే కూటమి సర్కార్ ఆ పని ఒకే సారి చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ కూటమి సర్కార్ అమలు చేస్తుందనీ, ఒక్కటొక్కటిగా ఒక్కో హామీనీ నెరవేరుస్తూ వస్తోందని చెప్పారు.