Leading News Portal in Telugu

ముద్రగడ నివాసంపై దాడి వైసీపీ డ్రామాయేనా? | attack on mudragada residence is ycp drama| tdp| mp| sana| satish| cheap| tricks| jagan| laughing


posted on Feb 3, 2025 3:44PM

ముద్రగడి నివాసంపై దాడి జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలోని ఆయన నివాసం ముందు ఉన్న కారు ఈ దాడిలో ధ్వంసమైంది. ఒక వ్యక్తి ట్రాక్టర్ పై వచ్చి ఈ విధ్వంసానికి పాల్పడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని  గన్నిశెట్టి గంగాధర్ గా గుర్తించారు. ఈ దాడిపై వైసీపీ పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతోంది. ఈ దాడి వెనుక  కుట్ర ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ దాడి గంగిశెట్టి గంగాధర్ ఒక్కడే చేయలేదనీ, ఆయన వెనుక ఎవరో ఉన్నారంటూ వైసీపీ గగ్గోలు పెడుతోంది.

అయితే తాజాగా ఈ విషయంలో  తెలుగుదేశం ఎంపీ సానా సతీష్ వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంపై దాడి వైసీపీ ప్లానేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  దాడికి పాల్పడిన గన్నిశెట్టి గంగాధర్ ముద్రగడ పద్మనాభరెడ్డి అనుచరుడేననీ, వ్యక్తిగత కారణాలే ఈ దాడికి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి కోసం వైసీపీ పాకులాడటం సిగ్గు చేటని సానా సతీష్ అన్నారు. వైసీపీ అధినేత జగన్ ముద్రగడ పద్మనాభంకు ఫోన్ చేసి పరామర్శించడం కూడా ఒక డ్రామాయేనని విమర్శించారు.  ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న వైసీపీని  చూసి జనం నవ్వుకుంటున్నారని సానా సతీష్ అన్నారు.