Leading News Portal in Telugu

Shooting at school in Sweden


  • స్వీడన్‌లోని ఓ స్కూల్‌లో కాల్పుల మోత
  • 10మంది మృతి.. 20 మందికి పైగా గాయాలు
  • ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Sweden: స్వీడన్‌లోని ఓ స్కూల్‌లో కాల్పుల మోత.. 10మంది మృతి

స్వీడన్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడ అంతా భయానక వాతావరణం చోటుచేసుకుంది. కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 20 మంది వరకు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్వీడన్ లోని ఒరెబ్రా నగర శివారులోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న వేళ ఆగంతకుడు పాఠశాలలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాల్పుల ఘటనకు ఉగ్రవాదులకు ఏమైనా సంబంధాలున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో ఉగ్రవాద కోణం లేదని నిర్ధారించారు. ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.