జగన్ అడిగి మరీ తిట్టించుకుంటున్నారుగా? | mopidevi venkataramana stromg counter to jagan| character| comments| remind| assets
posted on Feb 7, 2025 2:12PM
వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత చాలా మంది నేతలు పార్టీకి దూరం జరగడమో, రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవడమో చేశారు. ఇక వేరే మార్గం లేని పలువురు పార్టీలో ఉన్నా తామరాకు మీద నీటిబొట్టు మాదిరి పార్టీ వ్యవహారలలో ఇసుమంతైనా జోక్యం లేకుండా మౌనాన్ని ఆశ్రయించారు.
గతంలో జగన్ పై చిన్న పాటి విమర్శను కూడా సహించలేమంటూ ప్రత్యర్థులపై బూతుల వర్షం కురిపించిన నేతలు కూడా ఇప్పుడు నోటికి తాళం వేసుకున్నట్లుగా మౌనాన్ని ఆశ్రయించారు. గతంలోలా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ పంపితే దానికి మీడియా ముందు చదివేయడానికి రెడీగా ఉన్న నాయకులు వైసీపీలో వేళ్ల మీద లెక్కించవచ్చు. అదే గతంలో అయితే ఇలాంటి వారి సంఖ్య లెక్కకు మించి ఉండేది.
సరే ప్రస్తుతానికి వస్తే రాజ్యసభలో జగన్ పార్టీ బలం రోజురోజుకూ పడిపోతోంది. ఉన్న 13 మందిలో నలుగురు ఇప్పటికే తమ రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. గతంలోనే ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయగా, ఇటీవలే ఆ పార్టీ కీలక నేత, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయిన విజయసాయిరెడ్డి రాజీనామా చేసి పార్టీని వీడారు.
ఈ నేపథ్యంలోనే జగన్ గురువారం (ఫిబ్రవరి 6) మీడియాతో మాట్లాడుతూ పార్టీ వీడి వెళ్లిన వారికి క్యారెక్టర్ లేదంటూ విమర్శించారు. దీనిపై అనూహ్యంగా విజయసాయిరెడ్డి నుంచి స్ట్రాంగ్ రిటార్డ్ వచ్చింది. తనకు క్యారెక్టర్ ఉంది కనుకనే మీ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను అని ట్వీట్ చేశారు. నా క్యారెక్టర్ సరే మీకు క్యారెక్టర్ ఉందా అని జగన్ ను నిలదీసినట్లుగా విజయసాయి ట్వీట్ ఉంది.
ఇక విజయసాయి ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన మరో నాయకుడు మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఆయన కూడా తన క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని పేర్కొన్నారు. జగన్ తో పాటు ఆయన అక్రమాస్తుల కేసులో తాను కూడా జైలుకు వెళ్లి వచ్చానని పేర్కొన్న మోపిదేవి.. నిజంగా ఒత్తిళ్లకు లొంగిపోయే విడినైతే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కునే వాడినే కాదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఇద్దరూ జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ నెటిజనులు జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడటం అడిగి మరీ తిట్టించుకోవడానికే అన్నట్లుగా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు.