Leading News Portal in Telugu

కడపజైల్లో దస్తగిరికి బెదరింపులపై విచారణ.. వివేకా హత్య కేసులో కదలిక? | ap government order inquiry on threats to dastagiri in kadapa| jail| ysviveka| murder| case


posted on Feb 7, 2025 1:13PM

2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ కుటుంబం అడ్డా కడప జిల్లాలో అందునా వైఎస్ స్వగ్రామమైన పులివెందులలో జగన్ సొంత బాబాయ్  వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అదీ ఆయన సొంత నివాసంలో. అప్పట్లో ప్రతిపక్ష నేత అయిన జగన్ కు ఈ హత్య సానుభూతిని ప్రోది చేసి పెట్టింది. వివేకా హత్య జరిగిన నాటి నుంచీ ఈ కేసు దర్యాప్తులో అనేకానేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హత్య జరిగిన వెంటనే   అప్పటికి  ప్రతిపక్షమైన   వైసీపీ అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పించింది. అప్పటి ప్రతిపక్ష  నేత జగన్.. సొంత బాబాయ్ ని పొట్టన పెట్టుకున్నారంటూ శోనక్నాలు పెట్టి ప్రజా సానుభూతిని సంపాదించుకున్నారు. చివరికి ఆ సానుభూతే ఆయనకు అధికార పీఠవ తక్కేలా చేసింది. అయితే  తీరా అధికారంలోకి వచ్చాకా.. ఆరోపణలన్నీ రివర్స్ అయ్యాయి. అప్ప ట్లో జగన్ అండ్ కో అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లపై  ఆరోపణలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత  వాటి గురించి మళ్లీ మాట్లాడలేదు. ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్య కేసును సీబీఐ చేత దర్యాపు చేయాలంటూ  డిమాండ్ చేసిన జగన్  అధికార పగ్గాలు అందుకున్న తరువాత  సీబీఐ దర్యాప్తు అవసరం లేదంటూ తన పిటిషన్ ను కూడా ఉపసంహరించుకుంది. అయితే   వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత పట్టుదలతో న్యాయం కోసం  సాగించిన అలుపెరుగని పోరాటం ఫలితంగా వివేకా హత్య కేసు సీబీఐ చేతికి వెళ్లింది. జగన్ తన అధికారాన్ని ఉపయోగించి సీబీఐ దర్యాప్తునకు ఆ దర్యాప్తునకు అడుగడుగునా అడ్డుపడ్డారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై పులివెందులలో దాడి యత్నాలు జరిగాయి. హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడ్డారు. సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు నమోదయ్యాయి. దీంతో మళ్లీ మరోసారి వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించి మరీ కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యేలా చేశారు.

మొత్తంగా ఈ కేసులో  సీబీఐ దర్యాప్తులో భాగంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులెవరన్న విషయంలో జన బాహుళ్యంలో ఒక స్పష్టత వచ్చింది. ఇంటి దొంగలే వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్నారన్న అనుమానాలు నిరాధారమైనవేమీ కావన్న స్పష్టత వచ్చింది.  కడప లోక్ సభ అభ్యర్థి విషయంలో వచ్చిన విభేదాలే వివేకా హత్యకు మోటి వ్ గా సీబీఐ దర్యాప్తు తేల్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సొంత కుటుంబ సభ్యులే దూరమయ్యారు. వివేకా కుమార్తె సునీత కూడా తన అన్న అధికారంలో ఉండగా తన తండ్రి హత్య కేసు తేలే అవకాశాలు లేవన్న నిర్ధారణకు వచ్చారు. అందుకే అన్నకు వ్యతిరేకంగా హస్తిన వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పై ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. ఇవన్నీ తెలిసినవే. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం. అది ఈ హత్య  విషయంలో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని సందేహాతీతంగా ఎత్తి చూపింది.

అటువంటి దస్తగిరి వేరే కేసులో అరెస్టై కడప కారాగారంలో ఉన్న సమయంలో వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్నవారి నుంచి బెదరింపులు వచ్చాయి. ఆ బెదరింపులపై దస్తగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దస్తగిరి ఫిర్యాదు మేరకు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డితో పాటు కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఐఎన్ఎస్ ప్రకాశ్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపై కేసు నమోదైంది. ఇప్పుడు తాజాగా కడప జైలులో దస్తగిరిపై వేధింపుల ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ను నియమించింది. దీంతో మరో సారి వివేకా హత్య కేసులో కదలిక వచ్చిందని భావించవచ్చు.