Leading News Portal in Telugu

Team India Starts 2025 Champions Trophy with a Win, Axar Patel Misses Hattrick Due to Rohit Dropped Catch


  • ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా విజయంతో శుభారంభం
  • బంగ్లాదేశ్ పై 6 వికెట్లతో విజయం
  • మ్యాచ్ లో క్యాచ్ డ్రాప్​ చేసిన కెప్టెన్ రోహిత్.
  • మ్యాచ్ అనంతరం అక్షర్​కు ఆఫర్ ఇచ్చిన రోహిత్
Champions Trophy 2025: క్యాచ్ డ్రాప్​ చేసినందుకు అక్షర్​కు ఆఫర్ ఇచ్చిన రోహిత్

Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా విజయంతో శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, ఈ విజయంతో అందరూ సంతోషంగా ఉన్న.. అక్షర్ పటేల్‌కు మాత్రం కొంత అసంతృప్తి మిగిలింది. హ్యాట్రిక్‌కు ఒక్క వికెట్ దూరంలో ఉన్న అతడు, కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ వదిలేయడం కారణంగా గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో అక్షర్ 9వ ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు. తంజీద్ హసన్ (25), ముష్ఫికర్ రహీమ్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. హ్యాట్రిక్ బంతికి, కొత్తగా వచ్చిన జేకర్ అలీ ఔటవ్వాల్సిన అవకాశం వచ్చింది. అతడు ఔట్‌సైడ్ ఎడ్జ్‌తో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతిలోకి లడ్డూ లాంటి క్యాచ్ ఇచ్చాడు. కానీ రోహిత్ ఆ క్యాచ్‌ను పట్టలేకపోయాడు.

దీంతో అక్షర్ హ్యాట్రిక్ వికెట్స్ అందుకోలేకపోయారు. తన తప్పిదాన్ని అర్థం చేసుకున్న రోహిత్ వెంటనే అక్షర్‌కు క్షమాపణ చెప్పాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “ఆ క్యాచ్‌ను నేను పట్టాల్సింది. కానీ, స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తుంటే ఒక్కోసారి ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి. క్యాచ్ మిస్ అయినందుకు రేపు అక్షర్‌ను డిన్నర్‌కి తీసుకెళ్తాను” అని సరదాగా అన్నాడు. రోహిత్ ఆ క్యాచ్‌ను అందుకుని ఉంటే బంగ్లాదేశ్ 200 పరుగుల దాటే పరిస్థితి ఉండేది కాదు. కానీ, జేకర్ అలీ (68), తౌహిద్ హృదయ్ (100) బ్యాటింగ్‌తో మెరుగ్గా ఆడి జట్టును గౌరవప్రదమైన స్కోర్‌కి చేర్చారు.

అక్షర్ ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసాడు. హ్యాట్రిక్ అవకాశాన్ని కోల్పోయినా, తన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌పై ఒత్తిడి పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు కం బ్యాక్ హీరో షమీ 5 వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. మొత్తానికి, టీమ్ఇండియా గెలుపుతో ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టింది. అయితే, అక్షర్‌కి వచ్చిన హ్యాట్రిక్ అవకాశాన్ని రోహిత్ మిస్ చేయడం, టీమ్‌కి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది.