- పాకిస్తాన్‌పై సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ
- గిల్, అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు
- సెంచరీ చేయడం ఆనందంగా ఉంది

36 ఏళ్ల వయసులో విశ్రాంతి చాలా అవసరమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. విశ్రాంతి తీసుకుంటే మిగతా మ్యాచుల్లో రాణించడానికి దోహదం చేస్తుందన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ (100 నాటౌట్: 111 బంతుల్లో 7 ఫోర్లు) సెంచరీ బాదాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. టీమిండియా ఆటగాళ్లకు వారం రోజుల పాటు విశ్రాంతి లభించనుంది. దీనిపై కోహ్లీ స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్‌పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ… ‘కీలక మ్యాచ్‌లో నేను బాగా బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రోహిత్ శర్మ త్వరగానే అవుట్ అయినా.. మ్యాచ్‌లో నిలుదొక్కుకోవడం, పరుగులు చేయడం మంచి అనుభూతిని ఇస్తోంది. రిస్క్ తీసుకోకుండా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను నియంత్రించాలనుకున్నా. శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడాడు. నేను కూడా కొన్ని బౌండరీలు బాదాను. ఈ క్రమంలో వన్డేల్లో నా సహజసిద్ధమైన ఆట బయటకి వచ్చింది. నా ఆట పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది’ అని తెలిపాడు.
‘మైదానంలో చాలా గోలగా ఉంటుంది. శబ్దాలతో సంబంధం లేకుండా నా ఆలోచనలను పూర్తిగా అదుపులో ఉంచుకున్నా. ఎక్కువ సేపు క్రీజులో ఉండి.. నా వంతు పరుగులు చేసి జట్టుకి సహాయపడాలనుకున్నా. పేస్ బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు చేయకుంటే.. స్పిన్నర్లు మనల్ని నియంత్రిస్తారు. ఈ అంశంపై నేను చాలా స్పష్టతతో ఉన్నా. షహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో గిల్ అద్భుతంగా ఆడాడు. అందుకే అతడిని ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్‌గా పిలుస్తారు. శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బాగా బ్యాటింగ్ చేశాడు. నేను సెంచరీ చేయడం ఆనందంగా ఉంది’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.