- చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన షుంటియన్ కెమికల్ గ్రూప్ ఉద్యోగులకు వింత రూల్.
- పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం పోతుందంటూ హెచ్చరిక
- విషయం కాస్త చర్చలకు దారితీయడంతో వెనక్కి తగ్గిన యాజమాన్యం.

China: చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన షుంటియన్ కెమికల్ గ్రూప్ అనే కంపెనీ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుని దేశ ఉన్నత అధికారులు నుండి కఠినమైన హెచ్చరికలు అందుకుంది. ఈ కంపెనీ రాబోయే సెప్టెంబర్ నెల లోపల పెళ్లి చేసుకోని ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించగా.. దానితో ఆ విషయం కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కంపెనీ ఒక వివాదాస్పద విధానాన్ని (policy) ప్రవేశపెట్టింది. 28 నుండి 58 సంవత్సరాల వయస్సు ఉన్న అవివాహితులు, విడాకులు పొందిన ఉద్యోగులు ఈ నిబంధన పరిధిలోకి వస్తారని ప్రకటించింది. అలంటి వారు ఎవరైనా సెప్టెంబర్ వరకు పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం పోతుందని హెచ్చరించింది.
ఈ విధానం ప్రకారం, మార్చి నాటికి పెళ్లి కాని వారు ఓ లెటర్ సమర్పించాల్సి ఉండేది. ఆ తర్వాత జూన్ నాటికి పెళ్లి కాని వారిని విశ్లేషణ ప్రక్రియకు గురిచేయనున్నారు. ఇక చివరకు సెప్టెంబర్ నాటికి పెళ్లి చేసుకోని వారు ఉద్యోగం కోల్పోతారు. ఇకపోతే, కంపెనీ తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు చైనాలోని సాంప్రదాయ విలువలను ప్రస్తావించింది. పెళ్లి చేయకపోవడం అనైతికం అని పేర్కొంటూ.. ప్రభుత్వం వివాహాలను ప్రోత్సహిస్తుంటే దానికి సహకరించకపోవడం దేశానికి వ్యతిరేకమని పేర్కొంది.
మరోవైపు, ఈ ప్రకటనపై భారీ విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక మనవ వనరుల అండ్ సామాజిక భద్రతా శాఖ ఫిబ్రవరి 13న కంపెనీని తనిఖీ చేసింది. ఆ తర్వాత కేవలం ఒక రోజులోనే కంపెనీ ఈ పాలసీని ఉపసంహరించుకుంది. అలాగే, ఇప్పటి వరకు ఏ ఉద్యోగినీ పెళ్లి కారణంగా తొలగించలేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కొందరు న్యాయ నిపుణులు అసంబద్ధమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది అని పేర్కొన్నారు. పీటింగ్ విశ్వవిద్యాలయ న్యాయ విభాగానికి చెందిన ప్రొఫెసర్ యాన్ టియాన్ ఈ విధానం పెళ్లి స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడ్డారు. చైనా ఉద్యోగ చట్టాల ప్రకారం ఉద్యోగ నియామక ప్రక్రియలో వివాహ సంబంధిత ప్రశ్నలు అడగడం అనుమతించబడదు. ఈ వివాదం చైనాలో పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. పెళ్లి రేటును పెంచేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాయి. షాన్సీ ప్రావిన్స్‌లోని ఓ నగరం, 35 ఏళ్లలోపు వివాహం చేసుకునే జంటలకు 1,500 యువాన్ ల ప్రోత్సాహకం అందిస్తోంది.