- బంగ్లాదేశ్‌లో ఏదో జరగబోతోంది..
- ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏమిటి..
- యూనస్‌పై తిరుగుబాటు తప్పదా..?
- పాక్ జోక్యంపై అసహనంగా ఉన్న బంగ్లా ఆర్మీ..

Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ వ్యాఖ్యలు చూస్తే, రాబోయే కొన్ని రోజుల్లో మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర అసహనంతో ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకు తాజాగా, బంగ్లా ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు మద్దతు ఇస్తున్నాయి. దేశంలో శాంతిభద్రతల సమస్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల గురించి, ఫిబ్రవరి 25న జరిగిన జాతీయ అమరవీరుల సైనిక దినోత్సవంలో ఆయన మాట్లాడారు.
దిగజారిన పరిస్థితులకు, భద్రతా పరిస్థితికి రాజకీయ కలహాలే కారణమని, ప్రజలు ఒకరినొకరు దూషించుకుంటున్నారని చెప్పారు. పోలీసుల అసమర్థత గురించి వ్యాఖ్యానించారు. అంతర్గత పోరాటాలు బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని అంతర్గత విభజనలు ఆగిపోవాలని జమాన్ అన్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత యూనస్ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి అక్కడ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు రెచ్చిపోతున్నాయి.
యూనస్‌పై, పాక్ జోక్యంపై బంగ్లా ఆర్మీలో అసహనం:
ప్రస్తుత పాలనపై బంగ్లా సైన్యం తీవ్ర అసహనంతో ఉందని తెలుస్తోంది. యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌తో చెట్టాపట్టాల్ వేసుకు తిరుగుతోంది. ఇటీవల పాక్ ఐఎస్ఐ చీఫ్ బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చాడు. ఆ సమయంలో సైన్యంలో నాలుగో స్థానంలో ఉన్న క్వార్టర్ మాస్టర్ జనరల్ అయిన లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఫైజుర్ రెహ్మన్‌తో ఐఎస్ఐ చీఫ్ సమావేశం అయ్యారు. ఫైజుర్ రెహ్మాన్ పాకిస్తాన్‌కి గట్టి మద్దతుదారుగా ఉన్నారు.
పాకిస్తాన్ తన రాజకీయ ప్రాక్సీల ద్వారా బంగ్లాదేశ్‌లో జోక్యం చేసుకుంటుండటం సైన్యంలోని మెజారిటీ కమాండర్లకు నచ్చడం లేదని వినికిడి. ఈ నేపథ్యంలోనే యూనస్ సర్కార్‌కి ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ పరోక్షంగా అల్టిమేటం విధించినట్లు తెలుస్తోంది. ఇస్లామిస్ట్, రాడికల్‌గా పరిగణించే లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఫైజుర్ రెహ్మన్ని బంగ్లాదేశ్ కొత్త ఆర్మీ చీఫ్‌గా నియమించేందుకు పాక్ ఐఎస్ఐ, యూనస్ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలుస్తోంది.
షేక్ హసీనాకు సన్నిహితుడు జమాన్:
షేక్ హసీనా పాలన సమయంలో వకార్ ఉజ్ జమాన్ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఇతడికి హసీనా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇతడి భార్య హసీనాకు బంధువు. జమాన్ ప్రజాస్వామ్య వ్యవస్థను కురుకునే వ్యక్తి. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉంటచే జమాన్, షేక్ హసీనా పాలనలో ప్రభుత్వానికి సలహదారుగా వ్యవహరించారు.
ట్రంప్ రాకతో మారిన పరిస్థితులు:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితులు మారుతున్నాయి. గతంలో జో బైడెన్, హిల్లరీ క్లింటన్ వంటి డెమొక్రాట్ నేతలతో మహ్మద్ యూనస్‌కి చాలా చిక్కని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, ట్రంప్ రావడంతో పరిస్థితులు మారాయి. బంగ్లాదేశ్‌కి ఇచ్చే ఆర్థిక సాయాన్ని కూడా ట్రంప్ కట్ చేశాడు. ఇటీవల మోడీ, ట్రంప్ భేటీలో బంగ్లాదేశ్ విషయాన్ని మోడీ చూసుకుంటారని ట్రంప్ చెప్పడాన్ని చూస్తే, రానున్న రోజుల్లో ఏదో ఒక గొప్ప కార్యక్రమం బంగ్లాదేశ్‌లో జరిగే అవకాశమే కనిపిస్తోంది. తాజాగా, ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.