Leading News Portal in Telugu

UK Man Places Upside-Down Statue on pothole Road


  • యూకేలోని ఓ వ్యక్తి అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్న నిరసన
  • రోడ్డుపై పేరుకుపోయిన నీటిలో మనిషిని పోలిన నకిలీ బొమ్మను తలకిందులుగా ఉంచి నిరసన
UK Man Places Upside-Down Statue: రోడ్డుపై గుంతలు.. యువకుడి వినూత్న నిరసన

రోడ్లపై గుంతలు వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. గుంతల్లో పడి కొందరు గాయాలపాలై, మరికొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు మన దేశంలో కోకొల్లలు. రోడ్ల నిర్మాణం చేపట్టాలంటూ తమకు తోచిన పద్దతుల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటారు. ఇదే రీతిలో ఓ యువకుడు రోడ్లపై గుంతలతో విసుగెత్తిపోయి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రోడ్డుపై పేరుకుపోయిన నీటిలో మనిషిని పోలిన నకిలీ బొమ్మను తలకిందులుగా ఉంచి రోడ్డు దుస్థితిని ఎత్తి చూపాడు. ఈ ఘటన లండన్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

యూకేలోని ఓ వ్యక్తి అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు రోడ్డుపై గుంతలో తలభాగం నీటిలో మునిగి కాళ్లు పైకి ఉంచిన నకిలీ బొమ్మను ఉంచాడు. జీన్స్‌లో గుడ్డ ముక్కలను నింపి, స్థిరత్వం కోసం వాటిలో కర్రలను ఉంచాడు. ఆ బొమ్మను తలక్రిందులుగా గుంతలో ఉంచానని అతను చెప్పాడు. సఫోల్క్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న కేంబ్రిడ్జ్‌షైర్‌లోని కాజిల్ క్యాంప్స్ గ్రామంలోని హేవర్‌హిల్ రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉన్నాయి.

జేమ్స్ అనే యువకుడు మాట్లాడుతూ రోడ్డుపై ఉన్న గొయ్యి ఎనిమిది నెలలుగా అక్కడే ఉందని చెప్పాడు. వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని వెల్లడించాడు. అధికారులు పట్టించుకోకపోవడంతోనే తాను ఇలా చేశానని తెలిపాడు. ఈ విషయం అధికారుల వద్దకు చేరింది. కేంబ్రిడ్జ్‌షైర్ కౌంటీ కౌన్సిల్ హైవే అధికారులలో ఒకరు రోడ్డును తనిఖీ చేసి, అవసరమైతే మరమ్మతులు చేపడతామని స్పష్టం చేశారు.