- ముంబై ఉగ్రదాడి నిందితుడి అప్పగింత మరింత ఆలస్యం..
- అమెరికా సుప్రీంకోర్టులో తహవ్వూర్ రాణా అత్యవసర పిటిషన్..
- భారత్‌కి అప్పగిస్తే చిత్రహింసలు పెడతారని సాకు..

26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాని భారత్‌కి అప్పగించడంలో మరోసారి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా పర్యటన సమయంలో ట్రంప్ రాణాని భారత్‌కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ఇరు దేశాలు చాటి చెప్పాయి. అయితే, పాక్-అమెరికన్ పౌరుడైన తహవ్వూర్ రాణా మరోసారి అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. దీంతో భారత్‌కి అప్పగింత ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
అయితే, అప్పగింతపై ఇరు దేశాలు పనిచేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. నవంబర్ 26, 2008లో జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 09 మంది ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబా ఈ దాడికి పాల్పడింది. ఈ కేసులో తహవ్వూర్ రాణా కీలక నిందితుడిగా ఉన్నాడు. గత కొంత కాలంగా ఇతడిని భారత్ తీసుకువచ్చి విచారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా, ఆయన మరోసారి భారత్‌కి అప్పగించకుండా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. ఫిబ్రవరి 28, 2025న తన అప్పగింతపై అత్యవసర స్టే కోరుతూ అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. మార్చి 2, 2025న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారి కేసుని ఉదహరిస్తూ, రాణా తన అత్యవసర పిటిషన్‌ని దాఖలు చేశాడు. భారత్‌కి అప్పగిస్తే తనను ‘‘చిత్రహింసలు’’ పెడతారనే సాకుని చూపించిన, అప్పగింతను నిలిపేయాలని కోరాడు. మార్చి 05, 2025న రానా అత్యవసర దరఖాస్తుని అమెరికా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. విచారణ తేదీని నిర్ణయించాల్సి ఉంది.