Leading News Portal in Telugu

Ravichandran Ashwin React on Champions Trophy 2025 Player Of the tournament


  • ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్
  • రచిన్‌ రవీంద్రకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు
  • అతడే అసలైన హీరో అంటున్న అశ్విన్‌
Champions Trophy 2025: అతడే అసలైన హీరో.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ ఇవ్వాల్సింది: అశ్విన్‌

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైసవం చేసుకుంది. ఫైనల్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రోహిత్‌ శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. టోర్నీ ఆసాంతం రాణించిన న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్రను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు వరించింది. ఈ అవార్డుపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్ చక్రవర్తి అసలైన హీరో అని, రచిన్‌కు బదులుగా అతడికే అవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.

రవిచంద్రన్‌ అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘యాష్‌ కి బాత్‌’లో మాట్లాడుతూ… ‘నా దృష్టిలో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు మాత్రం వరుణ్‌ చక్రవర్తిదే. వరుణ్‌ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం ఆడకపోవచ్చు కానీ.. ఆడిన మ్యాచ్‌లో పెను ప్రభావం చూపాడు. వరుణ్‌ లేకపోతే టీమిండియా గేమ్‌ మరోలా ఉండేదేమో. వరుణ్‌ ఓ ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్‌. గ్లెన్‌ ఫిలిప్స్‌ను ఔట్‌ చేసిన విధానం అద్భుతం. నేనే జడ్జ్ అయితే ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ వరుణ్‌కే ఇచ్చేవాడిని.అవార్డుకు అతడు 100 శాతం అర్హుడు’ అని చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో వరుణ్ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో మూడు మ్యాచులలో 9 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.