Leading News Portal in Telugu

Rohit Sharma Captain for Basit Ali Champions Trophy 2025 Team


  • ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్
  • బెస్ట్‌ టీమ్‌ను వెల్లడించిన పాక్ మాజీ క్రికెటర్
  • బసిత్ అలీ టీమ్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ
Champions Trophy 2025: పాక్ మాజీ క్రికెటర్ బెస్ట్ టీమ్‌.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!

పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్.. 12 ఏళ్ల తర్వాత ట్రోఫీని సొంతం చేసుకుంది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా రోహిత్ సేన కప్‌ను దక్కించుకుంది. ఇప్పటికే ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌’ను ప్రకటించింది. భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన బెస్ట్‌ టీమ్‌ను వెల్లడించాడు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కూడా తన ప్లేయింగ్ 11ను ప్రకటించాడు. బసిత్ తన జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు ఇచ్చాడు.

‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్‌లో మ్యాచ్‌లను చూశాం. ప్లేయర్స్ గడాఫీ స్టేడియంలోనూ మంచి ప్రదర్శనలు చేశారు. 11 మందితో కూడిన జట్టును ఎంపిక ఎంచుకున్నా. టోర్నీలో బాగా ఆడిన ఆటగాళ్లతో జట్టును ప్రకటిస్తున్నా. ఐసీసీ జట్టును నేను సరిపోల్చడం లేదు. నా టీమ్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ. టోర్నీ ఆసాంతం కెప్టెన్‌గా రాణించాడు. ఫైనల్‌లో హాఫ్ సెంచరీతో మ్యాచ్‌ గతినే మార్చేశాడు. మరో ఓపెనర్‌గా రెండు సెంచరీలు చేసిన రచిన్ రవీంద్రను ఎంచుకున్నా. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడాల్సిందే. మ్యాచ్‌ పరిస్థితిని అంచనా వేయడంలో అతడు దిట్ట. భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన శ్రేయస్‌ అయ్యర్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తా. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ ఉంటాడు’ బసిత్ అలీ తెలిపాడు.

‘ఆరో స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ ఆడతారు. ఫిలిప్స్ అద్భుతమైన బౌలర్, ప్రమాదకరమైన ఫీల్డర్‌. ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను ఏడో స్థానంలో ఆడిస్తా. నా జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటిచ్చాను. వరుణ్‌ చక్రవర్తి, మిచెల్ శాంట్నర్‌కు అవకాశం ఇచ్చాను. అక్షర్ పటేల్‌ రేసులో ఉన్నా.. శాంట్నర్‌ను ఎంచుకున్నా. మహమ్మద్ షమీ, మ్యాట్ హెన్రీలు ఫాస్ట్‌ బౌలర్లుగా ఆడుతారు’ అని బసిత్ అలీ తన జట్టును ప్రకటించాడు.

బసిత్ అలీ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, గ్లెన్ ఫిలిప్స్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ శాంట్నర్, వరుణ్‌ చక్రవర్తి, మహమ్మద్ షమీ, మ్యాట్ హెన్రీ.