- గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం కాదు..
- యూఎస్ వైస్ ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్..

Green Card: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో పాటు అమెరికా పౌరసత్వంపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. వలసలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనను పెంచాయి. ముఖ్యంగా భారతీయులతో పాటు ఆ దేశంలో స్థిర నివానం ఏర్పరుచుకోవాలనుకునే వారికి షాక్ ఇచ్చారు. ఆయన ‘‘గ్రీన్ కార్డు’’లపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.
నిజానికి అమెరికాలో గ్రీన్ కార్డు వస్తే, అక్కడ శాశ్వత నివాసిగా పరిగణించబడుతారు. ఇది అమెరికాలో నివసించడంతో పాటు పనిచేసే హక్కుని ప్రసాదిస్తుంది. అయితే, ‘‘శాశ్వత నివాసం’’ అనేది సంపూర్ణ హామీ కాదు అని జేడీ వాన్స్ చెప్పారు. ‘‘గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు అమెరికాలో ఉండటానికి నిరవధిక హక్కు లేదు’’ అని చెప్పాడు.‘‘ఇది వాక్ స్వాతంత్ర్యం గురించి కాదు, ఇది జాతీయ భద్రత గురించి. అమెరికన్ పౌరులుగా మన సమాజంలో ఎవరు చేరాలో నిర్ణయించుకునే దాని గురించి’’ అని చెప్పారు.
నేర కార్యకలాపాలు, దీర్ఘకాలం దేశంలో లేకపోవడం లేదా వలస నిబంధనల్ని పాటించకపోవడం వంటి కొన్ని పరిస్థితుల్లో గ్రీన్ కార్డుల్ని రద్దు చేయడానికి యూఎస్ చట్టం అనుమతిస్తుంది. ఇటీవల అమెరికన్ పౌరసత్వం కోసం ట్రంప్ ‘‘గోల్డ్ కార్డ్ ’’ విధానాన్ని తీసుకువచ్చారు. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే ఈ గోల్డ్ కార్డును మంజూరు చేస్తామని చెప్పారు. ‘‘ప్రస్తుతం ఉన్న విధానం భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతుల్ని ఇక్కడ ఉండనీవ్వకుండా చేస్తోందని, గోల్డ్ కార్డ్ చొరవ వల్ల కంపెనీలు విదేశీ ప్రతిభను నియమించుకోవచ్చు.’’ అని ట్రంప్ చెప్పారు. గోల్డ్ కార్డ్ ప్రస్తుతం EB-5 వలస పెట్టుబడిదారు వీసాను భర్తీ చేస్తుందని భావిస్తున్నారు.
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నుండి వచ్చిన ఇటీవలి డేటా ప్రకారం, యూఎస్ వర్క్ వీసాల వల్ల భారతీయ పౌరులు ప్రధాన లబ్ధిదారులుగా ఉన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, అక్టోబర్ 2022 మరియు సెప్టెంబర్ 2023 మధ్య జారీ చేయబడిన మొత్తం H1B వీసాలలో 72.3 శాతం భారతీయ దరఖాస్తుదారులకే దక్కాయి.