- ఉక్రేనియన్ సైనికుల ప్రాణాలను కాపాడమని విజ్ఞప్తి చేసిన ట్రంప్
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు చూడని భయంకరమైన మారణహోమం
- ట్రంప్ పిలుపుకు మేము సానుకూలంగా ఉన్నామని పుతిన్ ఓ ప్రకటనలో తెలిపారు

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు రెండో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఇరు దేశాల దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందల భవనాలు నెలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు విజ్ఞప్తి చేశాడు. వేలాది మంది ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలను కాపాడాలని ట్రంప్ పుతిన్‌కు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ దళాలు పూర్తిగా చుట్టుముట్టబడ్డాయని ట్రంప్ తెలిపాడు. యుద్ధంతో ఉక్రెయిన్ చితికి పోయిందని కనికరం చూపాలని ట్రంప్ కోరాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు చూడని భయంకరమైన మారణహోమం అవుతుందన్నారు.
రష్యా సైనిక దాడి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుర్స్క్ ప్రాంతంలోని ఉక్రేనియన్ దళాలను లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే వారు బతికే ఉంటారని రష్యా అధ్యక్షుడు అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పిలుపుకు మేము సానుకూలంగా ఉన్నామని పుతిన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉక్రేనియన్లు లొంగిపోయి ఆయుధాలు వదిలివేస్తే, వారు జీవించడానికి, గౌరవంగా చూసుకోవడానికి హామీ ఇస్తామని పుతిన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడి పిలుపును సమర్థవంతంగా అమలు చేయడానికి, ఉక్రెయిన్ సైనిక-రాజకీయ నాయకత్వం తన దళాలను ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని ఆదేశించాలని పుతిన్ అన్నారు.
రష్యా గత వారం రోజులుగా కుర్స్క్‌లో తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న పెద్ద భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. గత ఏడాది ఆగస్టులో ఉక్రేనియన్ సైన్యం ఆకస్మిక దాడి చేసి కుర్స్క్‌లోని ఒక పెద్ద ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. సుదీర్ఘ యుద్ధం తర్వాత కూడా, రష్యన్ సైన్యం మొత్తం ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయింది. అయితే, గత నెల చివర్లో వైట్ హౌస్‌లో జరిగిన వివాదం తర్వాత ట్రంప్ అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేసిన తర్వాత ఉక్రెయిన్ సైన్యం ఒత్తిడిలో పడింది.