Leading News Portal in Telugu

Essential Eye Care Habits to Maintain Healthy Vision


  • కంటి చూపులో తేడాలు రాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తప్పనిసరి.
  • స్క్రీన్ టైమ్ తగ్గించడం, శరీరానికి తగినన్ని నీటిని అందించడం
  • క్రమం తప్పకుండా కళ్ల పరీక్షలు, సన్‌గ్లాసెస్ ధరించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి.
Eye Care: కంటి చూపులో తేడాలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Eye Care: మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కేవలం శరీరానికి మాత్రమే కాకుండా కళ్ళ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందికి కళ్లజోడు అవసరమవుతున్న సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా, డిజిటల్ స్క్రీన్ల వాడకం పెరగడం, అనారోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల కళ్లకు సంబంధించి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 7 వరకు బ్లైండ్నెస్ వీక్ (Blindness Week) నిర్వహిస్తారు. కళ్లకు సంబంధించి అవగాహన పెంచడానికి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవచ్చు. మరి మన కళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాటించాల్సిన ముఖ్యమైన అలవాట్ల గురించి తెలుసుకుందామా..

క్రమం తప్పకుండా కళ్ల పరీక్షలు:
గ్లౌకోమా, డయాబెటిక్ రేటినోపతి మొదలైనవి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనపడవు. కాబట్టి, పెద్దవారు ప్రతి 1 లేదా 2 సంవత్సరాలకు ఒకసారి కళ్ల పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. పిల్లలు, వృద్ధులు అయితే ప్రతి ఏడాది కనీసం ఒకసారి కళ్ల పరీక్ష చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తక్కువ సమయంలో గుర్తించి సమయానికి చికిత్స తీసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి:
నిపుణుల సూచనల ప్రకారం, మన రోజువారీ ఆహారంలో విటమిన్ A, C, E, ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. పాలకూర, నారింజ పండ్లు, డ్రై ఫ్రూట్స్, ద్రాక్ష మొదలైనవి కంటిశుక్లం సమస్యను నివారించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత ఈ పదార్థాలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సన్‌గ్లాసెస్ ధరించడం తప్పనిసరి:
సూర్యుని అల్ట్రావయొలెట్ (UV) కిరణాలు కళ్లకు హాని కలిగించవచ్చు. ఇవి కంటిశుక్లంను త్వరగా తీసుకురావడంతో పాటు కళ్ల క్యాన్సర్ వంటి సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి, 100% UV రక్షణ కలిగిన సన్‌గ్లాసెస్ ధరించడం చాలా ముఖ్యం. అవి కళ్లను పొడివేసే దుమ్ము, ధూళి, హానికరమైన కిరణాల నుంచి రక్షిస్తాయి.

స్క్రీన్ టైమ్ తగ్గించాలి:
కంప్యూటర్, ఫోన్, టెలివిజన్ వంటి డిజిటల్ స్క్రీన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్లలో డ్రై నెస్. స్ట్రెయిన్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి, స్క్రీన్ సమయాన్ని నియంత్రించడం ఎంతో అవసరం. ఇందుకోసం 20-20-20 నియమాన్ని పాటించండి. అంటే ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలోని వస్తువును, 20 సెకన్లపాటు చూడాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు తగినంత విశ్రాంతి లభిస్తుంది.

శరీరానికి తగినన్ని నీటిని అందించాలి:
శరీరంలో నీరు తక్కువగా ఉండడం వల్ల కళ్లలో పొడిబారటం, గుల్లలు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కనుక రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం మంచిది. అలాగే తేమ అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల హైడ్రేషన్ పెరుగుతుంది.