
ప్రపంచంలోనే అతిపెద్ద పండుగా పిలువబడే పనసలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ ఎ, విటమిన్ సి వంటి విటమిన్లతో పాటూ, పనసపండులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, రిబోఫ్లేవిన్, రాగి , మాంగనీస్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా పనస కాయలు దొరుకుతాయి. మార్కెట్లలో, రోడ్ల మీద పనస తొనలు అమ్మడం చూస్తుంటాం. చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పనస పండు తొనలను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం..
మూత్రపిండాల సమస్య :
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు పనస తొనలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పనస పండు తినడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా హానికరం. పనసపండు తినడం వల్ల మూత్రపిండాలలో కలిగే సమస్యను హైపర్‌కలేమియా అంటారు. ఇది గుండెపోటు, పక్షవాతానికి కూడా కారణమవుతుంది. సాధారణ వ్యక్తులు పనస తొనలు తినడం వల్ల ఏ ప్రమాదం ఉండదు. కానీ కిడ్నీ రోగులు తింటే ప్రమాదం. ఎందుకంటే పొటాషియాన్ని క్లీన్ చేసే సామర్థ్యం మీ కిడ్నీలకు ఉండదు. దీంతో.. కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువై ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. కనుక మూత్రపిండాల సమస్య ఉన్నవారు పనస కాయ తినకూడదు.
శస్త్రచికిత్స చేయించుకున్న వారు :
శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు లేదా, ఏదైనా శస్త్రచికిత్సకు ముందు పనస పండు తినకూడదు ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఎందుకంటే శస్త్రచికిత్స సమయంలో పనస పండు తినడం వల్ల కడుపు నొప్పి, వాపు, జీర్ణ సమస్యలు మొదలైన కడుపు సమస్యలు వస్తాయి. శస్త్రచికిత్స లేదా ఆపరేషన్‌కు రెండు వారాల ముందు పనస తొనలు తినకపోవడమే మేలు. కనుక డైజషన్ ప్రాబ్లం ఉన్నవారు పనసకు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది.
డయాబెటిస్ :
డయాబెటిస్.. ప్రజంట్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న పెను ముప్పు. ఈ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. డయాబెటిస్‌తో బాధపడేవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక, మధుమేహ రోగులు పనస తొనలు తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పనసపండులో ఉండే యాంటీ-డయాబెటిక్ అంశాలు శరీరంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. ఒకవేళ తినాలనిపిస్తే మితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వృదులు మాత్రం తినకపోవడం మంచిది.
చర్మ సమస్యలు :
ఈ రోజుల్లో చాలా మంది ఏదో ఒక అలెర్జీ సమస్యలతో బాధపడుతునే ఉన్నారు. అలాంటి వారు పనస తొనలకు దూరంగా ఉండాలి. బిర్చ్ పుప్పొడి, రబ్బరు పాలుకు అలెర్జీలు ఉన్నవారు పనస పండ్లు అసలు తినకూడదు. ఈ వ్యాధి ఉన్నవారిలో పనస పండు తినడం వల్ల అలెర్జీలు పెరుగుతాయి. చర్మంపై దద్దుర్లు, మంట, బొబ్బలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఇలాంటి వారు పనస పండు తినకూడదు.
ప్రెగ్నెన్సీ సమయంలో :
ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యం అయిన ఘటం. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తినే ఆహారం, తాగే అలవాట్లపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఇందులో భాగంగా ప్రెగ్నెన్సీ సమయంలో పనస పండు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పనస పండులో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది తల్లికి, గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఇద్దరికీ హానికరం. అందుకే ఈ సమయంలో పనస జోలికి వెళ్ళకూడదు. మీకు ఒకవేళ తినాలనిపిస్తే వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహా తీసుకుని తినాలి.