
బిలియనీర్, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనం సృష్టించారు. అదే XChat! ఈ కొత్త మెసేజింగ్ యాప్ వాట్సాప్, టెలిగ్రామ్‌లకు గట్టి పోటీ ఇవ్వబోతోందని టాక్ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే వాటన్నిటినీ మించి ఈ యాప్ లో ఫీచర్స్ ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అసలు ఈ యాప్‌ని ఎందుకు తీసుకొస్తున్నారు? దీని స్పెషల్ ఫీచర్స్ ఏంటి? భవిష్యత్తులో ఇది ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది?
ఎలాన్ మస్క్ ఎప్పుడూ కొత్త ఆలోచనలతో, భవిష్యత్ టెక్నాలజీని రూపొందించే ప్రయత్నంలో ఉంటారు. 2022లో ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత.. దాన్ని Xగా మార్చి ఒక “ఎవరీథింగ్ యాప్”గా తీర్చిదిద్దాలని మస్క్ ప్రయత్నిస్తున్నారు. X అనేదాన్ని కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గా పరిమితం చేయకుండా… చాటింగ్, కాలింగ్, పేమెంట్స్, మరెన్నో సర్వీసులను ఒకే చోట అందించే డిజిటల్ ఎకోసిస్టమ్‌గా మారాలని మస్క్ కలలు కంటున్నారు. ఆ విజన్ లో భాగంగా పుట్టుకొచ్చిందే XChat. ప్రస్తుతం మెసేజింగ్ మార్కెట్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లు డామినేట్ చేస్తున్నాయి. కానీ మస్క్ ఈ రంగంలో కూడా తన ముద్ర వేయాలనుకుంటున్నారు. XChat ద్వారా X ప్లాట్‌ఫామ్ యూజర్లకోసం ఒక అత్యాధునీక యాప్ ని తీసుకురాబోతున్నారు. యూజర్లకు ఇది అత్యంత సెక్యూరిటీ కల్పిస్తుంది. అంతేకాక.. వేగంగా, సరికొత్త ఫీచర్స్ తో రాబోతోంది. X యాప్‌లో ఇప్పటికే ఉన్న డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్‌ని మరింత అధునాతనంగా మార్చి, వాట్సాప్‌కు సమానమైన ఎక్స్ పీరియన్స్ ని అందించాలనేది లక్ష్యం.
XChat అనేది సాధారణ మెసేజింగ్ యాప్ కాదు. ఇది అత్యాధునిక ఫీచర్స్ తో ఆకట్టుకోబోతోంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది ఆల్ ఇన్ వన్ యాప్. Xchatలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఇందులో సైన్ అప్ కావడానికి ఫోన్ నంబర్ అవసరం లేదు. కేవలం 4-అంకెల పిన్‌తో లేదా X ఖాతాతో సైన్-అప్ చేయవచ్చు. మన మెసేజ్ లకు ఇది భద్రత కల్పిస్తుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వల్ల మెసేజ్‌లు, కాల్స్ పూర్తిగా సురక్షితం. బిట్‌కాయిన్ తరహా ఎన్‌క్రిప్షన్ తో ఇది పని చేస్తుందని మస్క్ పేర్కొన్నారు. అయితే దీనిపైన కొన్ని సందేహాలున్నాయి. ఎందుకంటే, బిట్‌కాయిన్ ఎన్‌క్రిప్షన్ అనేది డిజిటల్ సిగ్నేచర్‌లపై ఆధారపడుతుంది. డేటాను ఎన్‌క్రిప్ట్ చేయదు. ఇక వాట్సాప్ లో లాగానే సెట్ చేసిన సమయం తర్వాత మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. మన గోప్యతను కాపాడతాయి. PDFలు, ఇమేజ్‌లు, వీడియోలు లాంటి ఎలాంటి ఫైల్స్ నైనా సులభంగా షేర్ చేయవచ్చు. XChat ద్వారా ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. వీడియో కాల్స్ తో చేసుకోవచ్చు. ఈ యాప్ Rust లాంగ్వేజ్‌తో డెవలప్ చేయబడింది. ఇది వేగవంతమైన, సురక్షితమైన పనితీరును అందిస్తుంది. X ప్లాట్‌ఫామ్‌తో ఇది సులువుగా అనుసంధానమవుతుంది. ఇది యూజర్లకు ఒకే యాప్‌లో సోషల్ మీడియా, చాటింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రస్తుతం XChat బీటా టెస్టింగ్‌లో ఉంది. పరిమిత యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు, ఆ తర్వాత అందరికీ విడుదల కానుంది.
వాట్సాప్, టెలిగ్రామ్‌లతో Xchatను చాలా మంది పోల్చి చూస్తున్నారు. వాటికంటే XChat ఎలా భిన్నంగా ఉంటుందని ఆరా తీస్తున్నారు. వాట్సాప్ లో సైన్ అప్ కావాలంటే కచ్చితంగా ఫోన్ నెంబర్ ఉండాలి. టెలిగ్రామ్ లో ఫోన్ నెంబర్ తో పాటు ఇతర ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ XChat లో సైనప్ కావడానికి ఫోన్ నెంబర్ అవసరం లేదు. కేవలం నాలగంకెల పిన్ సరిపోతుంది. లేదా X వినియోగదారులైతే ఆ క్రెడెన్షియల్స్ తో సైనప్ కావచ్చు. ఇది మన ప్రైవసీకి ఎంతో ఉపయోగపడుతుంది. వాట్సాప్ లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ డిఫాల్ట్ గా అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ లో సీక్రెట్ చాట్స్ కు మాత్రమే ఎన్‌క్రిప్షన్ ఉంది. సాధారణ చాట్స్ ఎన్‌క్రిప్ట్ కావు. కానీ Xchatలో అన్ని అంశాలకూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వర్తిస్తుంది. అయితే బిట్‌కాయిన్-స్టైల్ ఎన్‌క్రిప్షన్ లో సెక్యూరిటీ ఆడిట్‌లు లేకపోవడం ఒక లోపం. వాట్సాప్ ద్వారా ఆడియో – వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్ లాంటివి చేసుకోవచ్చు. డిసప్పియరింగ్ మెసేజెస్ కూడా ఉన్నాయి. టెలిగ్రామ్ లో లార్జ్ గ్రూప్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. చానెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే 2GB వరకూ ఉన్న ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చు. XChat లో డిసప్పియరింగ్ మెసేజెస్ తో పాటు అపరిమిత ఫైల్ షేరింగ్స్ చేసుకోవచ్చు. నాణ్యమైన ఆడియో, వీడియో కాల్స్ దీని సొంతం. X ఇంటిగ్రేషన్ దీనికి పెద్ద ప్లస్. భవిష్యత్తులో AI ఇంటిగ్రేషన్ తో పాటు పేమెంట్ సర్వీసెస్ తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు ఎలాన్ మస్క్.
భవిష్యత్తులో XChat ను ఒక విప్లవాత్మక యాప్ గా తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు ఎలాన్ మస్క్. ప్రపంచంలో ఇప్పుడున్న సోషల్ మీడియా యాప్స్, మెసేజింగ్ యాప్స్, పేమెంట్స్ యాప్స్.. ఇలా అన్నిటినీ ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేసి ఎవ్రీథింగ్ యాప్ గా తీర్చిదిద్దాలనేది మస్ ఐడియా. భవిష్యత్తులో XChat విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని టెక్నాలజా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మస్క్ కు చెందిన xAI ద్వారా Grok వంటి AI టూల్స్ XChatలో భాగమవ్వచ్చు. స్మార్ట్ రిప్లైలు, రియల్-టైమ్ ట్రాన్స్ లేషన్, చాట్ ఆటోమేషన్ వంటి ఫీచర్స్ రావచ్చు. XChat ఒక ఎవరీథింగ్ యాప్ కావాలని మస్క్ భావిస్తున్నారు. XChat ద్వారా డిజిటల్ పేమెంట్స్, క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్స్ అందుబాటులోకి రావచ్చు. X భారీ యూజర్ బేస్‌ని ఉపయోగించి, XChat వేగంగా పాపులర్ కావచ్చు. ముఖ్యంగా గోపనీయతకు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో దీని వినియోగం భారీగా ఉండొచ్చు. భవిష్యత్తులో “అన్‌డూ రీడ్ స్టేటస్”, “డిలీట్ ఫర్ ఆల్” వంటి ఫీచర్స్ జోడించవచ్చు, ఇవి యూజర్ కంట్రోల్‌ని మరింత పెంచుతాయి. కానీ, సెక్యూరిటీ ఆడిట్‌లు, యూజర్ ట్రస్ట్ సంపాదించడం XChat ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్లు. వాట్సాప్ ఇప్పటికే 3 బిలియన్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. దాన్ని XChat బీట్ చేయడం అంత ఈజీ కాదు.
ఇప్పటివరకూ ఎక్కువ మంది వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి వాటిపైనే యూజర్లు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే ఇకపై XChat కూడా వినియోగదారులను అబ్బురపరిచేందుకు సిద్ధమవుతోంది. XChat ప్రస్తుతం బీటా ఫేజ్‌లో ఉంది. పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు ముందుగా, ఆ తర్వాత అందరికీ అందుబాటులోకి రానుంది. చాట్ హిస్టరీని ఎన్‌క్రిప్టెడ్ XChatకి అప్‌గ్రేడ్ చేయడానికి స్కేలింగ్ సమస్యలను పరిష్కరించాలని మస్క్ పేర్కొన్నారు. ఇక బిట్‌కాయిన్-స్టైల్ ఎన్‌క్రిప్షన్ అనే పదం వాస్తవ సెక్యూరిటీ ప్రోటోకాల్ కంటే మార్కెటింగ్ టర్మ్ గా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. XChat వాట్సాప్, టెలిగ్రామ్‌లకు గట్టి పోటీ ఇస్తుందని, ముఖ్యంగా గోప్యతపై ఫోకస్ చేసే యూజర్లను ఆకర్షిస్తుందని అంచనా.
XChat ద్వారా ఎలాన్ మస్క్ మరోసారి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఫోన్ నంబర్ లేని సైన్-అప్, ఎన్‌క్రిప్షన్, X ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్స్ తో ఇది వాట్సాప్, టెలిగ్రామ్‌లకు గట్టి పోటీ ఇవ్వవచ్చు. కానీ.. సెక్యూరిటీ ఆడిట్‌లు, యూజర్ ట్రస్ట్ సంపాదించడం దీని విజయానికి కీలకం.