
Trump Mobile 5G: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ అమెరికాలో కొత్త మొబైల్ నెట్‌వర్క్ సేవలను ప్రారంభించారు. “T1 మొబైల్” పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు అమెరికా దేశవ్యాప్తంగా 5G కవర్‌తో పాటు పూర్తిగా కస్టమర్ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రకటించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనిని ప్రారంభించారు. అమెరికాలో ఉన్న మూడు ప్రధాన నెట్‌వర్క్ లతో భాగస్వామ్యం ద్వారా ఈ సంస్థ విశ్వసనీయమైన, సరసమైన సెల్యులార్ సేవలను అందించనున్నట్టు ప్రకటించింది.
ఇక T1 మొబైల్ కంపెనీ ప్రధాన ఆఫర్‌గా “ది 47 ప్లాన్” పేరిట సేవలు అందిస్తోంది. ఇందులో అమితమైన కాల్స్, మెసేజులు, డేటా, డివైస్ ప్రొటెక్షన్, డ్రైవ్ అమెరికా ద్వారా 24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, వర్చువల్ మెడికల్ కన్సల్టేషన్‌లు, మెంటల్ హెల్త్ సపోర్ట్, ప్రిస్క్రిప్షన్ డెలివరీ వంటి టెలీహెల్త్ సదుపాయాలు అందించనున్నారు. అలాగే ఇందులో 100 కంటే ఎక్కువ దేశాలకు ఉచిత ఇంటర్నేషనల్ కాల్స్ (అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలు) పొందవచ్చు. ఈ కనెక్షన్ కోసం ఎలాంటి కాంట్రాక్ట్ అవసరం లేదు.. అలాగే క్రెడిట్ చెక్ లేదు.
T1 మొబైల్ నుంచి “T1 ఫోన్ (మోడల్ 8002)” ను కూడా లాంచ్ చేయనున్నారు. గోల్డ్ వేరియంట్ కోసం ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం సెప్టెంబర్ 2025లో విడుదల కానున్నా, సమాచారం మేరకు ఆగస్టులోనే ఈ మొబైల్ విడుదలయ్యే అవకాశముంది. ఈ ఫోన్ ధర 499.99 డాలర్స్ గా (సుమారుగా రూ. 43,000) నిర్ణయించారు. ఇక “ది 47 ప్లాన్” ప్రస్తుతం USD 47.45 (సుమారుగా రూ. 4083) నెలవారీ ఖర్చుతో అందుబాటులో ఉంది. దీనిని అధికారిక వెబ్‌సైట్ trumpmobile.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.