
సాధారణంగా మన రక్తపోటు 120/80 mmHg ఉండాలి. ఇది శరీర ఆరోగ్యానికి అనుకూలమైన స్థాయిగా భావించబడుతుంది. అయితే ఈ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీ (High Blood Pressure) అంటారు. ఇదే విధంగా, రక్తపోటు స్థాయి 90/60 mmHg కంటే తక్కువగా ఉండితే దాన్ని లోబీపీ (Low Blood Pressure)గా పరిగణిస్తారు. హైబీపీ ఎలా శరీరాన్ని ప్రభావితం చేస్తుందో, లోబీపీ కూడా అంతే ప్రమాదకరం గా మారవచ్చు. రక్తప్రవాహం తక్కువగా ఉండడం వల్ల ముఖ్యమైన అవయవాలకు తగినంత ఆక్సిజన్ మరియు పోషకాలు అందకపోవచ్చు. ఇది మైకం, అలసట, నిరాశక్తత వంటి సమస్యలకు దారితీయొచ్చు. అందుకే బీపీ స్థాయిని సమతుల్యం గా ఉంచుకోవడం చాలా అవసరం.
లో బీపీ కారణాలు ఏమిటి?
లో బీపీ అంటే రక్తపోటు సాధారణ స్థాయికి తక్కువగా ఉండడం. ఇది ఒక ఆరోగ్య సమస్య గా భావించబడుతుంది, ముఖ్యంగా శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహం సరిగా చేరకపోయినపుడు. లో బీపీ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు – శరీరంలో చలిమయం, మతిమరుపు, మైకం లాంటి ఫీలింగ్, ఒకేసారి అధిక ఆందోళన, ఏకాగ్రత లోపం, గుండె దడపడటం చాలా వేగంగా లేదా నెమ్మదిగా అనిపించడం, పల్స్ తక్కువగా ఉండటం లేదా సరిగ్గా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొన్ని సందర్భాల్లో చర్మం పాలిపోయినట్టు లేదా నీలి రంగులోకి మారినట్టు అనిపించవచ్చు. అంతేకాదు, పెదవులు కూడా నీలం రంగులోకి మారుతాయి. ఇది ప్రమాద సూచిక గా పరిగణించాలి. లో బీపీ కి అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా డీహైడ్రేషన్, తీవ్రమైన రక్తస్రావం, గుండె సంబంధిత సమస్యలు, థైరాయిడ్ వ్యాధులు, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు, తీవ్రమైన అలర్జీలు, పోషకాహార లోపాలు, కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్, గర్భధారణ సమయంలో హార్మోనల్ మార్పులు వంటి వాటి వలన ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. దానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం, లేదంటే అది మరింత ప్రమాదకర స్థాయికి చేరవచ్చు.
నీళ్లు తప్పనిసరి..
లో బీపీ కి ప్రధాన కారణాల్లో ఒకటి శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోవడమే. తగినంత నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ ఏర్పడి రక్తపోటు తక్కువగా మారుతుంది. అందువల్ల, రోజుకు కనీసం 10 నుండి 12 గ్లాసుల నీరు లేదా సుమారు 3 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. అంతేకాదు, కొబ్బరినీళ్లు శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి సమకూర్చే శక్తి కలిగి ఉండటంతో, అవి లోబీపీని తగ్గించడంలో సహాయ పడతాయి. నారింజ, దానిమ్మ వంటి పండ్ల రసాలు కూడా లోబీపీ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో ఉండే సహజమైన చక్కెరలు రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తాయి. కాబట్టి, తగిన మోతాదులో నీళ్లు తీసుకోవడం, పోషకాహారం తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా లోబీపీని సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
ఉప్పు వాడకం..
శరీరంలో సోడియం స్థాయి తగిన మోతాదులో లేకపోతే కూడా లో బీపీ సమస్య తలెత్తుతుంది. సోడియం ప్రధానంగా ఉప్పులో లభిస్తుంది. కొందరు ఆరోగ్యవంతమైన జీవనశైలికి అనుసంధానంగా ఉప్పు తీసుకోవడం పూర్తిగా మానేస్తుంటారు. కానీ ఇది మంచిది కాదు. శరీరానికి ప్రతి రోజు సుమారు ఒక టీస్పూన్ (సుమారు 5 గ్రాములు) ఉప్పు అవసరం. ఉప్పును పూర్తిగా మానేయడం వల్ల రక్తపోటు తగ్గి శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. అందుకే మితంగా అయినా నిరంతరం ఉప్పు తీసుకుంటూ ఉండాలి. అంతేకాక..
లో బీపీ సమస్య నివారణకు విటమిన్లు B9 (ఫోలిక్ యాసిడ్), B12 ఉన్న ఆహారాలు తీసుకోవాలి. కోడిగుడ్డు, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు శరీరానికి అవసరమైన విటమిన్లు అందిస్తాయి. అదేవిధంగా ఆకుకూరలు, బ్రోకలీ, పప్పులు, బీన్స్, నారింజలు, దానిమ్మ వంటి సిట్రస్ పండ్లు, నట్‌లు, మటన్ లివర్ వంటి ఆహారాలు కూడా బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ఈ రకాల సమతుల్య ఆహారం తో పాటు సరైన జీవనశైలి పాటిస్తే లోబీపీ సమస్యను సులభంగా ఎదుర్కోవచ్చు.
ప్రత్యేకంగా తినవలసినవి:
కిస్మిస్ – రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి, బీట్‌రూట్ జ్యూస్ – రోజూ ఒక కప్పు తాగాలి,బాదంపప్పులు – నీటిలో నానబెట్టి తినాలి.