- దేశంలో నెలకు 50 వేలకుపైగా ఫోన్లు పోయిపోతున్నాయట
- కేవలం 15 శాతం మాత్రమే తిరిగి లభ్యమవుతున్నాయి
- ‘Find My Device’, CEIR బ్లాక్ లాంటివే మీ రక్షణ ఆయుధాలు

Find My Divice : ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ కీలక పాత్ర పోషిస్తోంది. కమ్యూనికేషన్ మొదలుకొని డేటా స్టోరేజ్, బ్యాంకింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు ఇలా అన్నింటికీ మొబైల్ ఆధారంగా ఉంటుంది. అయితే ఈ అవసరాల మధ్య, ఫోన్ పోగొట్టుకోవడం లేదా దొంగతనానికి గురవడం అనేది పెద్ద సమస్యగా మారుతోంది.
CEIR నివేదికలో నిజాలు బయటకు
ప్రతి నెలా దేశవ్యాప్తంగా 50వేల కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లు దొంగిలించబడుతున్నాయో లేక పోగొట్టుకున్నాయో CEIR (Central Equipment Identity Register) నివేదిక వెల్లడించింది. అయితే ఈ ఫోన్లలో కేవలం 15 శాతం మాత్రమే తిరిగి వినియోగదారులకు రికవర్ అవుతున్నాయి. మిగిలిన 85 శాతం ఫోన్లు కనుమరుగవుతున్నాయి. దీని వల్ల వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం, ఆర్థిక నష్టం వాటిల్లుతోంది.
CEIR ద్వారా IMEI బ్లాక్ చేయవచ్చు
మొబైల్ మిస్ అయిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in) ద్వారా ఫోన్ IMEI నంబర్‌ను బ్లాక్ చేయవచ్చు. ఇది దొంగలు ఫోన్‌ను ఉపయోగించకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒకవేళ దొంగలు సిమ్ మార్చినప్పటికీ, ఫోన్ ట్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది.
నిపుణుల సూచన.. Find My Device తప్పనిసరి
సైబర్ భద్రత నిపుణుల సూచన మేరకు, ప్రతి యూజర్ తన ఫోన్‌లో ‘Find My Device’ (Androidకు) లేదా ‘Find My iPhone’ (iOSకు) ఫీచర్‌ను ఎప్పుడూ ఎనేబుల్ చేయాలి. ఇది ఫోన్ మిస్ అయినపుడు గూగుల్ అకౌంట్ ద్వారా ఫోన్ స్థితిని లొకేషన్‌తో సహా ట్రాక్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
లొకేషన్ సేవలు ఆన్‌లో ఉండాలి
ఫోన్ స్థానం తెలుసుకోవాలంటే అందులో GPS లొకేషన్ ఆన్‌లో ఉండాలి. చాలా మంది డేటా సేవలు సేవ్ చేసేందుకు లొకేషన్ ఆఫ్ చేస్తారు. కానీ ఇది ఫోన్ మిస్ అయినపుడు దాన్ని ట్రాక్ చేయడంలో అడ్డంకిగా మారుతుంది.
పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలి
ఫోన్ పోయిన వెంటనే అత్యవసరంగా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయాలి. ఈ FIR నంబర్ ద్వారా CEIRలో ఫోన్ బ్లాక్ చేయడం సాధ్యమవుతుంది. ఇలా చేయడం ద్వారా ఫోన్ ఉపయోగించడాన్ని నిరోధించొచ్చు.
సామాన్య ప్రజలకు అవగాహన తక్కువే
ఈ సేవలు అందుబాటులో ఉన్నా కూడా చాలా మందికి అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్య. ఫోన్ పోయిన తర్వాత ఏమి చేయాలో తెలియక చాలా మంది ఖాళీచేతుల్తో తిరుగుతుంటారు. ప్రభుత్వం అందించిన సేవలు వినియోగించుకోవడం ద్వారా, ఫోన్‌ను తిరిగి పొందే అవకాశం పెరుగుతుంది.
రోజురోజుకీ డిజిటల్ ఆధారిత జీవితంలో మొబైల్ ఫోన్ల ప్రాముఖ్యత పెరుగుతున్న వేళ, వాటి భద్రతపై ప్రజలు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ‘Find My Device’ వంటి ఫీచర్లతో పాటు CEIR సేవలు ఒక ఉపశమనం అయినా, అవగాహనతో ముందుగానే అప్రమత్తం కావడమే ఉత్తమ పరిష్కారం.