ప్రస్తతం జపాన్ లో జపాన్ దేశంలో వృద్ధులు పెరిగిపోతుండడం, పనిచేసే యువత తగ్గిపోతుండటంతో.. ఆ దేశం ఇండియా వైపు చూస్తోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు మన దేశంలోని అత్యంత నైపుణ్యమున్న ప్రతిభావంతుల కోసం మొగ్గు చూపుతున్నది. ప్రస్తుతం ఆ దేశంలో 30 శాతం మందికిపైగా 65 ఏండ్లకు పైబడిన వారే ఉన్నారు. దీంతో ఆ దేశ వర్క్ ఫోర్స్ భారీగా పడిపోతున్నది.
2040 నాటికి ఆ దేశంలో పనిచేసే వారి సంఖ్య కోటి మందికిపైగా పడిపోతుందని పలు సంస్థలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ఆ దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఆందోళన మొదలైంది. ఇటు 2030 నాటికి దాదాపు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగుల కొరత కూడా ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కాకుండా అమెరికా, చైనా వంటి దేశాల్లో జీసీసీలను ఏర్పాటు చేయడంతో.. కంపెనీలకు ధరా భారంగానూ మారుతున్నట్టు చెప్తున్నారు.
ఈ క్రమంలో కాస్ట్ ను తగ్గించుకునేందుకు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిభ కలిగిన మానవ వనరులు మన దగ్గర ఎక్కువగా ఉండడంతో.. ఇండియా వైపు చూస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,800 జీసీసీలుండగా.. అందులో జపాన్ కు చెందిన సంస్థలే 85 ఉన్నాయి. దాదాపు 5 శాతం జీసీసీలు ఆ దేశానికి చెందినవే. ఆయా సంస్థల్లో ప్రస్తుతం 1.85 లక్షల మంది పనిచేస్తున్నారు.
అయితే, 2028 నాటికి జపాన్‌కు చెందిన జీసీసీలు రెట్టింపవుతాయని, 150 వరకు జీసీసీల ఏర్పాటుకు అవకాశముందని అంటున్నారు. వాటి ద్వారా 3.5 లక్షల మందికి ఉపాధి దొరకుతుందని, ఏటా రూ.22 వేల కోట్లకుపైగా (250 కోట్ల డాలర్లు) పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే జపాన్‌కు చెందిన ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ దాయిచి లైఫ్ హైదరాబాద్‌లో జీసీసీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాబోయే కాలంలో జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2026 చివరి నాటికి మరో 12 దాకా ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.