- మీ ఫోన్ లైఫ్ టైమ్ ఎంతో తెలుసా?
- ఇలా తెలుసుకోండి!
ప్రతి వస్తువుకు గడువు తేదీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పొరపాటున గడువు తీరిన వస్తువులను వాడితే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. పాలు, బ్రెడ్ తో పాటు, ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా గడువు తేదీ ఉంటుంది. దీని అర్థం మొబైల్ ఫోన్లు ఒక నిర్దిష్ట కాలం మాత్రమే సరిగ్గా పనిచేస్తాయి. ఆ తర్వాత వాటికి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అయితే, చాలా మందికి తమ ఫోన్ గడువు తేదీని ఎలా తనిఖీ చేయాలో తెలియదు. కానీ, కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా ఫోన్ గడువు తేదీని తనిఖీ చేయవచ్చు. మీ ఫోన్ తయారీ, గడువు తేదీని ఎలా తనిఖీ చేయాలో ఇప్పుడు చూద్దాం.
USA Today నివేదిక ప్రకారం.. కొన్ని ఫోన్లు రెండేళ్లు మాత్రమే పనిచేస్తాయి. అయితే చాలా ఫోన్లకు మూడు నుండి నాలుగు సంవత్సరాలు మద్దతు ఉంటుంది. ఫోన్ హార్డ్‌వేర్ అరిగిపోవడం కాదు, కంపెనీ ఎంతకాలం అప్‌డేట్‌లు, మద్దతును అందిస్తుంది అనేది ముఖ్యం. మీ ఫోన్ జీవితకాలం మీరు కొనుగోలు చేసినప్పుడు కాదు, అది తయారు చేసిన రోజు నుండి ప్రారంభమవుతుంది. దీని అర్థం మీ ఫోన్ ఆరు నెలలు స్టోర్‌లో ఉంటే, దాని జీవితకాలం అప్పటికే ప్రారంభమైందని.
ఆపిల్ ఫోన్లు 4 నుంచి 8 సంవత్సరాలు, సామ్ సంగ్ ఫోన్లు 3 నుంచి 6 సంవత్సరాలు, గూగుల్ పిక్సెల్ ఫోన్లు 3 నుంచి 5 సంవత్సరాలు, హువావే ఫోన్లు 2 నుంచి 4 సంవత్సరాలు జీవితకాలం ఉంటాయి. ఇంకా, కొన్ని మీడియా నివేదికలు వివో, లావా, ఇతర బ్రాండ్ల ఫోన్లు కూడా 3 నుంచి 4 సంవత్సరాల లైఫ్ టైమ్ కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయి. కొన్ని 5 సంవత్సరాల వరకు కూడా ఉంటాయి.
ఫోన్ గడువు తేదీని తెలుసుకోవడానికి సులభమైన మార్గం దాని తయారీ తేదీని కనుగొనడం. తయారీ తేదీ తరచుగా ఫోన్ బాక్స్ పై ఉంటుంది. బాక్స్ పడేసినట్లైతే మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి. మీరు ఫోన్ సీరియల్ నంబర్ లేదా తయారీ తేదీని అబౌట్ ఫోన్ లేదా అబౌట్ డివైస్ విభాగంలో కనుగొనవచ్చు. చాలా ఫోన్‌ల సీరియల్ నంబర్‌లో తయారీ తేదీని హైడ్ చేస్తారు. మీరు SNDeepInfo వంటి వెబ్‌సైట్‌కి వెళ్లి మీ ఫోన్ సీరియల్ నంబర్‌ను నమోదు చేయవచ్చు. మీ ఫోన్ ఎప్పుడు తయారు అయ్యిందో ఈ సైట్ మీకు తెలుపుతుంది.
మీరు కొన్ని కోడ్‌లను డయల్ చేయడం ద్వారా మీ ఫోన్ గురించి సమాచారాన్ని కూడా కనుగొనవచ్చు. ఉదాహరణకు, *#06# డయల్ చేయడం వల్ల ఫోన్ సీరియల్ నంబర్ తెలుస్తుంది. మీరు ఫోన్ తయారీ తేదీని తెలుసుకున్న తర్వాత, ఫోన్ ఎప్పుడు గడువు ముగుస్తుందో నిర్ణయించడానికి రాబోయే సంవత్సరాలను లెక్కించొచ్చు. ఉదాహరణకు, ఆపిల్ ఫోన్లు 4 నుంచి 8 సంవత్సరాలలో గడువు ముగుస్తాయి. ఈ విధంగా, మీరు గడువు తేదీని కనుగొనవచ్చు.
మీరు endoflife.date వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ సైట్ ఫోన్‌లు, సాఫ్ట్‌వేర్, ఇతర హ్యాండ్ సెట్ల గడువు తేదీలను అందిస్తుంది. అదనంగా, మీరు ఈ సైట్‌లో మీ ఆపిల్ వాచ్, ఐప్యాడ్ లేదా అమెజాన్ కిండిల్ వంటి ఇతర పరికరాల గడువు తేదీలను కూడా తనిఖీ చేయవచ్చు. సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేయాలని భావిస్తే ఈ సైట్ లో దాని గడువు తేదీని చెక్ చేసుకోవచ్చు.