Leading News Portal in Telugu

యాచకులకు హెయిర్‌కటింగ్‌ చేయించిన పోలీసులు !

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో యాచకులకు అర్బన్‌ జిల్లా తూర్పుమండల, దక్షిణ మండల డిఎస్పీలు పర్యవేక్షణలో హెయిర్‌కటింగ్‌ చేయించి దుస్తులు అందించారు. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పిల్లలను ఎత్తుకుపోయే గ్యాంగ్‌లు దొంగతనాలకు ఎగబడే ముఠాలు ఫొటోలు, వీడియోలను చూస్తున్న ప్రజానీకం అనుమానం వచ్చిన వారిపై ముకుమ్మడిగా దాడి చేస్తున్నారు.

ఈసంఘటనలు రాష్ట్రంలో పలు చోట్ల జరగడంతో అప్రమత్తమైన రాష్ట్రపోలీస్‌శాఖ అన్ని జిల్లాల్లో పోలీసులను జాగృతం చేసింది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకుని భిక్షాటన చేస్తూ చింపురు జుట్లు, గుబురు గెడ్డాలతో తిరుగుతున్న యాచకులను అనుమానించి దాడులు చేస్తున్నారు. ఈదాడుల్లో కొంతమంది చనిపోవడం వల్ల అటువంటివి ఎక్కడా జరగకుండా ఉండటం కోసం చర్యలు చేపట్టారు.

అందులో భాగంగా ఇటీవల అర్బన్‌ ఎస్పీ రాజకుమారి స్థానిక పుష్కరాలరేవులోనే 300 మంది యాచకులకు హెయిర్‌కటింగ్‌ చేయించి దుస్తులు అందించారు. శనివారం రాత్రి 10 గంటలకు డీఎస్పీలు నాగరాజు, నారాయణరావు నగరంలోని యాచకులను పుష్కరాలరేవుకు తీసుకువచ్చి హెయిర్‌ కటింగ్‌ చేయించి జల్లుస్నానం చేశాక వారికి దుస్తులు అందించి ఆహారాన్ని ఇచ్చారు. ఎవరి ఊళ్లకు వారు వెళ్ళిపోవాలని, లేదా నగరంలోని ఆశ్రమాలకు తరలిస్తామని వారికి చెప్పారు. గుబురు గెడ్డాలు, చింపురు జుట్లతో అనుమానంగా తిరిగితే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐలు నాగమోహన్‌రెడ్డి, ముక్తేశ్వరరావు, మారుతీరావు, రవీంద్ర, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.