వివాహేతర సంబంధం పెట్టుకొని మహిళను హత్యచేసిన పాస్టర్
రాజంపేట టౌన్(కడప జిల్లా): బోయనపల్లె వడ్డిపల్లె వద్ద ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనతో కాకుండా మరొక వ్యక్తితో సంబంధం ఉందన్న నెపంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న చర్చి పాస్టర్ 30 సంవత్సరాల మహిళను హత్య చేశాడు. డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు బోయనపల్లె దళితవాడకు చెందిన వర్ల సుబ్బరాయుడు కొంత కాలంగా బోయనపల్లెలోని యేసుక్రీస్తు చర్చికి పాస్టర్‌గా ఉంటున్నాడు. ఈ క్రమంలో చర్చికి సమీపంలో నివసిస్తున్న కొమ్మి ఇందిరమ్మ(30)తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. వారి వివాహేతర సంబంధం నాలుగు సంవత్సరాలకు పైగా జరిగిందని అయితే ఇందిరకు చెంగయ్య మరో వ్యక్తితో పది సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారికి పిల్లల్లేరు. వారు ప్రస్తుతం బోయనపల్లె వడ్డిపల్లెలో ఇందిర అక్క, బావ ఇంటిలో వారి పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అక్క, బావ కువైట్‌కు వెళ్లి డబ్బులు కూడా పాస్టర్ అకౌంట్‌కు పంపించే వారన్నారు.
శనివారం తెల్లవారుజామున ఇందిర ఇంటిలోకి పాస్టర్ సుబ్బరాయుడు ప్రవేశించి తలుపులకు గెడియ వేసి నువ్వు నాతో కాకుండా వేరొకరితో ఎందుకు మాట్లాడుతున్నావని గొడవ పడి ఇందిర మెడను చేతితో పట్టుకొని చంపడానికి ప్రయత్నించాడని, దీంతో ఇందిర అక్క పిల్లలు చూసి అరవగా వారిని కూడా తోసేసి ఇందిరను చంపేశాడన్నారు. చిన్నారులు కేకలు వేయడంతో మిద్దెపైన నిద్రిస్తున్న ఇందిర భర్త చెంగయ్య, స్థానికులు తలుపులు పగలగొట్టుకొని చూసే సమయానికి ఇందిర మృతి చెంది పడి ఉందన్నారు. దీంతో అక్కడ నుంచి ఫాస్టర్ సుబ్బరాయుడు పరారయ్యాడన్నారు.
అనంతరం అతను మన్నూరు పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని రాజంపేట డీఎస్పీ లక్ష్మీ నారాయణ, సీఐ నరసింహులు, ఎస్ఐ మహేష్ సందర్శించి విచారణ చేపట్టి హత్యకు గల కారణాలు తెలుసుకొని కడప క్లూస్ టీమ్ ఇందిర ఇంటిని మృతదేహాన్ని పరిశీలించిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట మార్చురీకి తరలించి మన్నూరు పోలీస్‌స్టేషన్‌లో కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. అయితే ఇందిరను చంపేసిన ఫాస్టర్ హత్యను పార్ధీ గ్యాంగ్ వచ్చి చంపేశారన్న విధంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని డీఎస్పీ తెలిపారు.