Leading News Portal in Telugu

ఆత్మ విశ్వాసమే గెలిపిస్తోంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత స్టార్ రెజ్లర్ సుశీల్‌ కుమార్‌ గతనెలలో జరిగిన కామన్‌ వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించారు. అదే జోరుతో రాబోయే ఆసియన్‌ గేమ్స్‌లోనూ తన సత్తా చాటుతానని ధీటైన ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.

‘ కామన్‌వెల్త్‌ క్రీడల్లో నాకు లభించిన విజయమే ఆసియన్‌ గేమ్స్‌లోనూ పునరావృతం కావాలని కోరుకుంటున్నాను. ఇందుకు నాకు దేశ ప్రజల ఆశీస్సులు ఎంతో ముఖ్యం. వారి మద్దతు లేనిదే విజయం సిద్ధించదు. ఆట ఆడేటప్పుడు అభిమానుల వద్ద నుంచి వచ్చే స్పందనే మాకు ఎంతో బలాన్నిస్తుంది. నాకు తెలిసీ ఏ క్రీడాకారుడికైనా ప్రధానం బలం అభిమానులే. ఆటలో నేను నా ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే ముందు నేను మానసికంగా దృఢంగా ఉండాలి. అందుకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. ఇన్నేళ్లుగా అదే నన్ను నడిపిస్తోంది, గెలిపిస్తోంది. క్రీడాకారులకు స్థానిక ప్రభుత్వాలు అండగా నిలవాలి. ప్రతి దేశంలోనూ ఒక్కో ఆటకు సంబంధించిన నిష్ణాతులు ఉంటారు. మనదేశంలో రెజ్లింగ్‌ విభాగంలో నేను ఆ స్థాయికి వెళ్లాలనుకుంటున్నాను. ఆసియన్‌ గేమ్స్‌, ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నాను. యువత క్రీడల్లోకి వస్తే బాగుంటుంది. క్రీడల్లోకి రావాలనే కోరిక చిన్నప్పటి నుంచే పిల్లలకు కలిగించాలి.’ అని తెలిపారు.

2018 ఆసియన్‌ గేమ్స్‌ ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకూ జరగనున్నాయి. ఈ క్రీడలకు ఇండోనేసియా ఆతిథ్యం ఇవ్వనుంది. కామన్‌వెల్త్‌ క్రీడల్లో కనబర్చిన జోరే ఈ క్రీడల్లోనూ కొనసాగించాలని భారత క్రీడాకారులు భావిస్తున్నారు.