Leading News Portal in Telugu

డోపీగా తేలిన సంజిత చాను

న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచి సంబరాల్లో ఉన్న భారత వెయిట్‌ లిఫ్టర్‌ సంజీత చానుకు భారీ షాక్‌ తగిలింది. డోప్‌ టెస్టులో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించింది. గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో బరిలోదిగిన ఆమె ఓవరాల్‌గా 192 కేజీల బరువెత్తి బంగారు పతకం సొంతం చేసుకుంది. 2014 గ్లాస్గో క్రీడల్లోనూ 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచింది. తాజాగా డోప్‌ టెస్టులో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు వినియోగించినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐడబ్ల్యూఎఫ్‌ గురువారం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

‘సంజీత చాను నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు (టెస్టోస్టిరాన్‌) వాడినట్లు రుజువైంది. యాంటీ డోపింగ్‌ రూల్స్‌ ప్రకారం ఇది నేరం. ఒకవేళ ఆమె డోపింగ్‌ నిరోధక నియమాలను ఉల్లంఘించలేదని నిరూపితమైతే… సంబంధిత నిర్ణయాన్ని కూడా తిరిగి ప్రకటిస్తాం’ అని ఐడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. కాగా డోప్‌ టెస్టు కోసం శాంపిల్స్‌ను ఎప్పుడు సేకరించారనే విషయం పై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై స్పందించేందుకు భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య అధికారులు అందుబాటులో లేరు. ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లోని జాతీయ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న చాను ఈ నిర్ణయంతో క్యాంపు వదిలి స్వస్థలమైన మణిపూర్‌కు పయనమైంది.