Leading News Portal in Telugu

తాజ్‌మహల్ కాదు ‘రామ్‌మహల్’.. బాంబ్ పేల్చిన బీజేపీ నేత

ఎప్పుడూ వివాదాల్లో ఉండే బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మళ్లీ బాంబ్ పేల్చారు. ఈసారి తాజ్‌మహల్‌పై కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. తాజ్‌మహల్‌కు రామ్ మహల్‌గా పేరు మార్చాలన్నారు. ‘ ముస్లిం రాజుల కాలంలో నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం సరికాదు.. ఎందుకంటే అవి మన భారత భూభాగంలోవే కదా. వాటి పేర్లు మాత్రం మార్చేస్తే సరిపోతుంది. తాజ్‌మహల్ అయితే రామ్‌మహల్ లేదా కృష్ణ మహల్‌గా మార్చాలి. నా వరకైతే రాష్ట్రభక్త్‌మహల్ అని పెడితే బావుంటుంది’ అని వ్యాఖ్యానించారు. తాజ్‌మహల్ మాత్రమే కాదు కోల్‌కతాలోని విక్టోరియా ప్యాలెస్ పేరును జానకి మహల్‌గా మార్చాలని డిమాండ్ చేశారు సురేంద్ర సింగ్.

సురేంద్ర సింగ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. కొద్ది రోజులు క్రితం లంచం అడిగే అధికారుల్ని చెప్పుతో కొట్టాలన్నారు. ఈ వివాదం మర్చిపోకముందే మళ్లీ తాజ్‌మహల్‌పై బాంబ్ పేల్చారు. తాజ్‌మహల్‌ పేరును మార్చమని సురేంద్ర సింగ్ మాత్రమే కాదు బీజేపీ ఎంపీ కటియార్ కూడా డిమాండ్ చేశారు. మొఘల్ రాజు శివాలయాన్ని కూల్చి తాజ్‌మహల్ కట్టాడని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని పదే, పదే చెబుతున్నా నేతలు పెడచెవిన పెడుతున్నారు.