Leading News Portal in Telugu

టెస్టు చరిత్రలో టీమిండియా తొలిసారి..

బెంగళూరు: టీమిండియా తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అఫ్గానిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్‌ లంచ్‌ సమయానికి 27 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌(104 బ్యాటింగ్‌; 91 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లు), మురళీ విజయ్‌(41 బ్యాటింగ్‌; 72 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌) లు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడారు. కాగా, టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్‌ ఒక మైలురాయిని నమోదు చేసింది. టెస్టు మ్యాచ్‌ ప్రారంభపు రోజు లంచ్‌కు ముందు ఒక ఆటగాడు సెంచరీ చేసిన ఘనతను టీమిండియా తొలిసారి సాధించింది. ధావన్‌ 87 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ నమోదు చేయడం ద్వారా భారత్‌ ఈ ఫీట్‌ను సొంతం చేసుకుంది.

అంతకుముందు ఒక టెస్టు ఓపెనింగ్‌ డే లంచ్‌ సమయానికి ముందు భారత్‌ తరపున ఒక ఆటగాడు నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగులు 99. 2006లో సెయింట్‌ లూసియాలో వెస్టిండీస్‌తో జరిగిన ​మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 99 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకూ టెస్టు ఓపెనింగ్‌ రోజున లంచ్‌కు ముందు ఒక భారత ఆటగాడు చేసిన అత్యధిక స్కోరుగా ఉంది. దాన్ని తాజాగా ధావన్‌ అధిగమించి సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఒక రికార్డును భారత్‌ లిఖించినట్లయ్యింది.

ఓవరాల్‌గా చూస్తే టెస్టు ప్రారంభపు రోజు లంచ్‌కు ముందు సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో వి ట్రంపర్‌(1902), సీ మకార్ట్నీ(1921), బ్రాడ్‌మన్‌(1930), మజిద్‌ ఖాన్‌(1976), డేవిడ్‌ వార‍్నర్‌(2017)లు ఉన్నారు. ఇప్పుడు వారి సరసన ధావన్‌ చేరడం మరో విశేషం.