Leading News Portal in Telugu

క్రీడాభిమానులకు జియోటీవీ బంపర్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయ ప్రజలు రేపు ఎప్పుడొస్తుందా? అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రేపటి నుంచే మెగా స్పోర్ట్స్‌ ఈవెంట్లు ఫిఫా వరల్డ్‌ కప్‌, భారత-ఆఫ్ఘనిస్తాన్‌ టెస్ట్‌ మ్యాచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. వీటిని తిలకించేందుకు యువతను మరింత ప్రోత్సహించడానికి రిలయన్స్‌ జియో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రేపటి(గురువారం) నుంచి 18వ తేదీ వరకు జరగబోయే ఇండియా-ఆఫ్ఘనిస్తాన్‌ టెస్ట్‌ మ్యాచ్‌ను ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచీ జియోటీవీ యాప్‌లో లైవ్‌బ్రాడ్‌కాస్ట్‌ చేయనున్నట్టు ప్రకటించింది. అంతేకాక జరగబోయే ఫిఫా వరల్డ్‌ కప్‌ను కూడా ఇది లైవ్‌గా బ్రాడ్‌కాస్ట్‌ చేయనున్నట్టు తెలిపింది. ఈ ప్రీమియం కంటెంట్‌ అంతటిన్నీ జియో యూజర్లందరికి ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది.

కంటెంట్‌ దిగ్గజాలు, బ్రాడ్‌కాస్టర్లతో కలిసి ఎక్స్‌క్లూజివ్‌ డీల్స్‌తో కంటెంట్‌ పోర్ట్‌ఫోలియోను జియో బలపరుస్తుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. అంతేకాక తన 13 కోట్ల మంది జియో టీవీ యూజర్లకు వచ్చే కొన్ని రోజుల్లో ఆశ్చర్యకరమైన ఆఫర్లతో పాటు, పలు ప్రయోజనాలను అందించనుందని తెలిపాయి. ఇటీవల కంపెనీ లాంచ్‌ చేసిన డబుల్‌ ధమాకా ఆఫర్‌తో ప్రీపెయిడ్‌ కస్టమర్లు అదనంగా రోజుకు 1.5 జీబీ హైస్పీడ్‌ డేటా పొందుతున్నారు.