Leading News Portal in Telugu

ధోనీ సింప్లిసిటీకి ఇదే నిదర్శనం : గావస్కర్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రాకతో భారత క్రికెట్‌లో ఓ విప్లవం వచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తనదైన కెప్టెన్సీతో ఈ జార్ఖండ్ డైనమైట్ ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితులోనైనా ప్రశాంతంగా ఉంటూ భారత్‌కు ఐసీసీ టైటిళ్లన్నీ అందించాడు. ఎంత ఎదిగినా.. ధోనీ మాత్రం ఒదిగే ఉంటాడు. అయితే తాజాగా ధోనీపై భారత మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

మిడ్-డే దినపత్రికకు రాసిన కాలమ్‌లో ధోనీ సింప్లిసిటీని ప్రస్తావిస్తూ కొనియాడాడు. ‘స్వదేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రయాణాల విషయంలో భారత క్రికెట్‌‌లో ఓ అద్భుతమైన విధానం ఉంది. ఈ విషయం చాలా మంది అభిమానులకు తెలుసు. స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల కోసం ఒక వేదిక నుంచి మరొక వేదికకు ఇరు జట్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తుంటాయి.

ఈ ఫ్లైట్‌లోనే టీవీ సిబ్బంది కూడా తమ సామాగ్రితో ప్రయాణిస్తుంటుంది. అయితే ఈ ఫ్లైట్‌లో కొన్నే బిజినెస్ క్లాస్ సీట్లుంటాయి. వీటిలో టీమ్‌మేనేజర్స్, కెప్టెన్, కోచ్‌లు మాత్రమే కూర్చుంటారు. ఆటగాళ్లలో ముందు మ్యాచ్‌లో ఎవరైతే అద్భుత ప్రదర్శన కనబరుస్తారో వారికి రివార్డుగా ఆ సీటు కేటాయిస్తారు. అయితే ధోనీ మాత్రం ఏనాడు బిజినెస్ క్లాస్ సీట్‌లో కూర్చునేవాడు కాదు. కెప్టెన్‌గా ఆ సీటులో కూర్చునే అవకాశం ధోనీకి ఉన్నా.. అతను మాత్రం టీవీ సిబ్బంది పక్కనే కూర్చోవడానికి ఇష్టపడేవాడు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుసరిస్తున్నాడు.’అని గావస్కర్ పేర్కొన్నాడు.

2018-19 ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బౌల‌ర్ల‌ను, బిజినెస్ సీట్ల‌లో సీట్లు కేటాయించార‌ని సన్నీ గుర్తు చేశాడు. ఇలాంటివి చిన్న విష‌యాలే అయిన‌ప్ప‌టికీ, దీర్ఘ‌కాలంలో జ‌ట్టులో స్ఫూర్తి నింపుతాయ‌ని గావస్కర్ చెప్పుకొచ్చాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు